
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దమని సీఎల్పీ కార్యదర్శి, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులందరికీ ఇంకా బ్యాంకుల్లో వడ్డీ అలాగే మిగిలి ఉందని, వడ్డీ మాఫీ చేస్తానని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన సీఎం ఇప్పుడు రైతులెవరూ తమకు దరఖాస్తు పెట్టుకోలేదనడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శమన్నారు.
బుధవారం నాటి సీఎం ప్రకటనతో రైతుల్లో కదలిక మెదలైయిందని, పరిగి రైతులు తమ బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను తనకు పంపుతున్నారని చెప్పారు. తనకు అందిన బ్యాంకు స్టేట్‌మెంట్స్‌లో వడ్డీని రైతులే చెల్లించినట్లు స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తమ బ్యాంకు స్టేటుమెంట్స్ అందించాలని కోరారు. రైతుల నుంచి అన్ని వివరాలు అందాక అసెంబ్లీలో సీఎంకు అందజేస్తామని, వడ్డీ మాఫీపై ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని కోరారు.