
చోడవరం/ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌పై దాడి జరిగిన ఘటన బాధ్యత ఏపీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంగీకరించారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోడికత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ కేంద్రానికి అప్పగించే విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటవేసే సమాధానమిచ్చారు.
విచారణ కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కోర్టు ఆదేశించినట్టయితే ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తుందా? అని విలేకరులు అడగ్గా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దర్యాప్తు కేంద్రం చేసినా, తాము చేసినా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని..తాము అదే పనిలో ఉన్నామని బదులిచ్చారు. ఘటన ఎయిర్‌పోర్టులో జరిగిందని చెప్పారే తప్ప బాధ్యత మాది కాదని చంద్రబాబు చెప్పలేదని, నిందితుడు ప్రాథమికంగా చెప్పిందే డీజీపీ మాట్లాడారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సిట్ విచారణ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. పోలీస్ కస్టడీలో ఉన్నవారు తమకు ప్రాణహాని ఉందని, ఆరోగ్యం బాగోలేదనే చెబుతారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పడంపై న్యాయవిచారణ జరిపిస్తామని తెలిపారు.