
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై తాము వాస్తవాలే మాట్లాడామని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు. అలాగే రాజధానిపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన వెనుక ఉన్న దురుద్దేశాన్ని తాము పరిశీలిస్తామని అన్నారు. రాజధానిలో ఒక్క నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఏముందని ప్రశ్నించారు. వాటి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి.. కేవలం 4 వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే చేశారని ఆయన మండిపడ్డారు. పచ్చటి పోలాలను స్మశానంగా మార్చి ఇప్పుడు ఏ ఉద్దేశంతో రాజధాని పర్యటనకు వెళ్లారని అన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదని వివరించారు.
చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని బొత్స పశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక విధానం ఉందని.. ఆ విధానంతోనే తాము ముందుకు వెళతాము తప్ప ఒక్క సామాజిక వర్గం కోసం కాదని స్పష్టం చేశారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము తప్ప చంద్రబాబు రాజధాని పర్యటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు.