‘రాహుల్‌తో కలిసిన పార్టీలన్నీ ఫినిష్‌’ | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 1:28 PM

BJP MP GVL Narasimha Rao Slams Chandrababu In Tirupathi - Sakshi

తిరుపతి(చిత్తూరు జిల్లా): దేశాన్ని రక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు.. కానీ దాని అర్ధం తెలుగు దేశాన్ని రక్షిస్తానని చెప్పడమే.. ప్రజలు ఈ విషయం గమనించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కోరారు. తిరుపతిలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న హడావిడి అంతా కాపాడటానికి కాదని దేశాన్ని కూల్చడానికేనని తీవ్రంగా విమర్శించారు. తానూ చిత్తూరు జిల్లా వాడినేనని, మా అమ్మ గారి సొంతూరు మదనపల్లి అని చెప్పారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలం చెందారని ఆరోపించారు. తన సొంత జిల్లాలో అభివృద్ధి చేయలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టులు బాబు బినామీలకు అప్పగింత
రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చంద్రబాబు తన బినామీలకు అప్పజెప్పారని జీవీఎల్‌ ఆరోపించారు. రాయలసీమలో ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. నిన్న ఢిల్లీలో యూటర్న్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన రాజకీయాల వల్ల దేశంలో ఎటువంటి మార్పు రాదని గ్రహించాలని హితవుపలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి అవినీతి కూటమి, అప్రజాస్వామిక కూటమి, ఈ కూటమిలో చేరిన పార్టీలు భూస్థాపితం అవుతాయని జోస్యం చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఏ కూటములు ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు.

2019 తర్వాత టీడీపీ కనుమరుగు
2019 ఎన్నికలు టీడీపీకి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని, ఆ తర్వాత టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతుందని జీవీఎల్‌ జోస్యం చెప్పారు. రాహుల్‌ గాంధీతో కలిసిన పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయని శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు, విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదని, కేవలం అవగాహనా రాహిత్యంగా బీజేపీపై బురదజల్లే దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దోలెరా నగరం ఏవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా చిత్తూరులో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ త్వరలో రాబోతుందని తెలిపారు. చెన్నై-కోల్‌కత్తా ఇండస్ట్రీ కారిడార్‌ రావడం వల్ల ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ఐదు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏపీ రాబోతున్నాయని తెలిపారు.

Advertisement
Advertisement