టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

BJP MP Arvind Comments On Cancellation Of Article 370 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ధర్మపురి పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌షా  ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ..  ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం తన చిన్నప్పటి కల అని, దీన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 370 ఆర్టికల్‌ రద్దుతో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి వేగవంతం అవుతుందని, అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రావణమాస సోమవారం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, వేలమంది సైనికుల ఆత్మలకు ఈ రోజు శాంతి కలుగుతుందన్నారు. అసలు జమ్మూ కశ్మీర్‌ భారతదేశంలో లేకుండా ఉండే అన్న టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎంఐఎం నాయకులకు చెంప చెళ్లుమన్నట్లు అయ్యిందని మండిపడ్డారు. 

ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ ప్రజలందరూ సంతోషంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కల నెరవేరిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్‌షా ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చిందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ దేశంలో అంతర్భాగమని, అది ఎవరి జాగీరు కాదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమో కాదో కాంగ్రెస్, ఇతర పార్టీలు స్పష్టం చేయాలన్నారు. 370 ఆర్టికల్‌ రద్దుకు వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top