‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’

AP Deputy CM Pamula Pushpa Srivani Slams Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విమర్శలు

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విమర్శలు గుప్పించారు. ఘోర ఓటమి చవిచూడటంతో ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని బాబు అంటున్నారు. మీ కొడుకును ఓడించిన మంగళగిరి వెళ్లి అడగండి. ఎందుకు ఓడిపోయారో చెప్తారు. 14 సీట్లలో 13 సీట్లలో ఓడించిన మీ సొంత జిల్లా చిత్తూరు వెళ్లి అడగండి. ఎందుకు ఒడిపోయారో చెప్తారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే 23 సీట్లు కాస్త 3 సీట్లు అవ్వక తప్పదు’ అన్నారు. 

తెలివి లేదని అవమానించారు..
‘గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది  పనులు చేపడుతున్నాం. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి గిరిజనుల పట్ల చిత్తశుద్ధిని చాటు కున్నాం. మా ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే ఆయన ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 600 హామీలిచ్చి మాట తప్పారు. మహిళల్ని కించపరిచారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని, గిరిజనులకు తెలివి లేదని వ్యాఖ్యానించి చంద్రబాబు అవమాన పరిచారు. 40 ఏళ్ల అనుభవం అని గొప్పలు చెప్పుకునే బాబుకంటే.. 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 40 రోజుల్లోనే హామీల అమలుకు కృషి చేస్తున్నారు’ అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top