కుమారస్వామి ప్రమాణానికి నవీన్‌ పట్నాయక్‌ డుమ్మా

Another Opposition Leader Naveen Patnaik Skips Kumaraswamys Swearing-in Ceremony - Sakshi

బెంగళూరు/భువనేశ్వర్‌: నరేంద్ర మోదీ ప్రాభవానికి, ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు నేడు ఓకే వేదికపై చేరాయి. జనతాదళ్‌(సెక్యూలర్‌) చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. ముగ్గురు తప్ప! వారు.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌. కేసీఆర్‌, స్టాలిన్‌లు కుమార ప్రమాణానికి రాలేకపోవడానికి గల కారణాలను ఇదివరకే ప్రకటించారు.

బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్‌ కోసం యత్నిస్తోన్న కేసీఆర్‌.. రాహుల్‌ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్‌ కుమారస్వామికి వర్తమానం పంపారు. అయితే నవీన్‌ పట్నాయక్‌ మాత్రం స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్‌ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

నవీన్‌ ఎందుకు రాలేదు?: 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్‌ పట్నాయక్‌.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్‌ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై  నవీన్‌ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు.

మైనింగ్‌ కుంభకోణం, శారద స్కామ్‌ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్‌ బీజేపీపై గట్టిగా గళం విప్పడంలేదని ఒడిశా కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్‌-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్‌ పట్నాయక్‌.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top