రాజగోపాల్‌కు మరో నోటీసు

Another Notice To Komati Reddy Rajagopal Reddy - Sakshi

షోకాజ్‌పై ఇచ్చిన జవాబుకు సంతృప్తి చెందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ

సరైన వివరణ ఇచ్చేందుకు మరో 24 గంటల గడువు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరో నోటీసు జారీ చేసింది. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని ఈ నెల 21న జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు రాజగోపాల్‌ ఇచ్చిన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదు. సరైన సమాధానం ఇచ్చేందుకు ఆయనకు మరో 24 గంటల గడువిచ్చింది. రాజగోపాల్‌ ఇచ్చిన సమాధానంపై చర్చించేందుకు చైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ కోచైర్మన్‌ శ్యాం మోహన్, కన్వీనర్‌ బి.కమలాకర్‌రావు, ఎంపీ నంది ఎల్లయ్య, సభ్యులు సంభాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాసరావులు హాజరయ్యారు.

రాజగోపాల్‌ పంపిన మూడు పేజీల సమాధానంపై రెండున్నర గంటలపాటు చర్చించిన సభ్యులు ఈనెల 21న పంపిన షోకాజ్‌ నోటీసుకు సరైన సమాధానం ఇచ్చేందుకు మరో నోటీసు జారీ చేసింది. ‘మీకు పంపిన షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఈనెల 23లోపు ఇవ్వాల్సి ఉన్నా 24వ తేదీ మధ్యాహ్నం మాకు అందింది. మీరు పంపిన మూడు పేజీల వివరణను కమిటీ చదివింది. క్రమశిక్షణ సంఘం అడిగిన అంశాల్లోని ఒక్క పాయింట్‌కు కూడా మీరు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ నెల 21న విలేకరుల సమావేశంలో నేను రెండు గంటల్లో షోకాజ్‌కు సమాధానం చెబుతానని అంటూనే క్రమశిక్షణ సంఘాన్ని కూడా విమర్శించారు. తనకు షోకాజ్‌ నోటీసు ఎలా ఇస్తారని, ఇచ్చేందుకు వాళ్లెవరని ప్రశ్నించారు.

మీకు షోకాజ్‌ అందిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. మీరు సరైన సమాధానం పంపలేదు. మళ్లీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీకు సమయం ఇస్తోంది. మరో 24 గంటల్లో మీకు అందిన షోకాజ్‌కు సరైన వివరణ ఇవ్వండి. లేదంటే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగం ప్రకారం మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’అని సోమవారం ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. కాగా, రాజగోపాల్‌రెడ్డికి 24 గంటల సమయమిచ్చిన నేపథ్యంలో బుధవారం మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యే అవకాశాలున్నాయని, తుది నిర్ణయం అదే రోజు తీసుకుంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

నేను క్రమశిక్షణ గల కార్యకర్తను.. రాజగోపాల్‌రెడ్డి వివరణ 
ఈనెల 21న తనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన మూడు పేజీల సమాధానంలో తాను కాంగ్రెస్‌కు క్రమశిక్షణ గల కార్యకర్తనని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పర్యటించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు తాను ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని రాజగోపాల్‌ పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలనుకుంటున్న తనకే షోకాజ్‌ నోటీసులెలా ఇస్తారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన తప్పుడు టికెట్ల కారణంగానే భువనగిరి ఎంపీగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని, కేసీఆర్‌ను సవాల్‌ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిచానని పేర్కొన్నట్లు తెలిసింది. కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు కొన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చని, అంతమాత్రాన షోకాజ్‌ల వరకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని క్రమశిక్షణ కమిటీని ప్రశ్నించినట్లు సమాచారం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top