‘ప్రతిపక్షం’ ఓట్లు తొలగింపు 

Anarchy of the ruling party leaders in the state - Sakshi

రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అరాచకం

వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లపై ఇష్టారాజ్యంగా వేటు  

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు గల్లంతు  

టీడీపీ సానుభూతిపరులకు రెండు, మూడు ఓట్లు  

వేర్వేరు నంబర్లతో ఓటర్‌ కార్డులు జారీ  

క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు, ప్రలోభాలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌:  అధికార పార్టీ అభిమానులు, సానుభూతిపరులైతే చాలు ఒకటికి మించి ఓట్లు లభిస్తాయి. రెండు మూడు చోట్ల ఓటు హక్కు దక్కుతుంది. వేర్వేరు నంబర్లతో ఓటర్‌ ఐడీ కార్డులు చేతికందుతాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తారనే అనుమానం ఏమాత్రం ఉన్నా అలాంటి వారి ఓట్లు గల్లంతవుతాయి. ఏకంగా ఓటు హక్కే రద్దవుతుంది. ఓటర్‌ జాబితాల్లోంచి పేర్లు మాయమవుతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న బాగోతమిది. ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌(వాస్ట్‌) బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ అరాచకం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, ప్రలోభాలకు గురిచేసి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుకు సమాధి కడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లపై వేటు వేశారు.  

చనిపోయినా ఓటు హక్కు పదిలం  
విశాఖ జిల్లాలో 2014 జనవరిలో 34,31,822 మంది ఓటర్లు ఉండేవారు. 2018 జనవరి నాటికి ఈ సంఖ్య ఏకంగా 30,83,722కు పడిపోయింది. తొలగించిన ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కొన్నిచోట్ల ఒకే ఓటర్‌కు రెండేసి, మరికొందరికి ఐదేసి ఓట్లు నమోదయ్యేలా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలోకి వచ్చేశాయి.  

అక్రమంగా వేలాది ఓట్ల నమోదు  
ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేయిస్తున్నారు. అక్టోబర్‌ 28న దొంగ ఓట్లు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఒత్తిడి, దూషణలను తట్టుకోలేక బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ జయశ్రీ పోలింగ్‌ బూత్‌ వద్దే కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను సహచర సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. కేవలం ఒక్క ఒంగోలు నిÄయోజకవర్గంలోనే 15 వేల ఓట్లను అక్రమంగా చేర్పించినట్లు అంచనా. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని అనుమానం వస్తే చాలు గుట్టుచప్పుడు కాకుండా వారి ఓట్లను తొలగిస్తున్నారు.
 
దొంగ ఓట్ల జాతర  
వైఎస్సార్‌ జిల్లాలో అధికార పార్టీ నేతల అడ్డగోలుగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఇతర జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉండే వ్యక్తుల పేరిట వైఎస్సార్‌ జిల్లాలో ఓట్లు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లపై వేటు పడుతోంది.  

అనంతపురంలో అక్రమాలకు అంతే లేదు  
అనంతపురం జిల్లాలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని ఓటర్ల తొలగింపునకు పాల్పడుతోంది. ప్రధానంగా అనంతపురం అర్బన్‌ పరిధిలో 64,592 ఓట్లను తొలగించారు. తాడిపత్రి నియోకవర్గం పరిధిలో 14,322 ఓట్లు, ధర్మవరంలో 10,475 ఓట్లు, కదిరిలో 7,757 ఓట్లు, హిందూపురం నియోజకవర్గంలో 3,426 ఓట్లను తొలగించారు. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారి ఓట్లను అధికంగా తొలగించారు. ఒకే ఓటర్‌ పేరిట రెండు మూడు చోట్ల ఓట్లు నమోదైన ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి.   

ఒకే బూత్‌లో రెండు ఓట్లు  
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని 237వ బూత్‌లో కుడిపూడి సతీష్‌కు రెండు ఓట్లున్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్‌ వీధిలో 3–67/1 అనే ఇంటి నెంబర్‌లో సతీష్‌ ఉంటున్నారు. అతడికి అదే ఇంటిలో 716, 800 సీరియల్‌ నంబర్లతో ఓట్లున్నాయి. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే ఇలాంటి ఓట్లు నమోదతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.  

నెల్లూరు జిల్లాలో ఓట్ల తొలగింపు  
నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన తిన్నెలపూడి ముత్యాలయ్య వయసు 52.వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గతంలో సాధారణ, పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో విస్తుపోయాడు. తాను వైఎస్సార్‌సీపీ అభిమానినని, అందుకే ఓటర్ల లిస్టు నుంచి పేరు తొలగించారని చెబుతున్నాడు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభిమానులుగా ఉన్న 15 మంది ఓట్లను తొలగించారని ముత్యాలయ్య వెల్లడించాడు. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన కందలూరి మద¯ŒŒ మోహన్‌రెడ్డి చాలా ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో గ్రామంలోని 130 పోలింగ్‌ బూత్‌లో ఓటు వేస్తున్నాడు. ఈ ఏడాది ఓటర్ల జాబితాలో చూస్తే ఆయన పేరు గల్లంతైంది.  

చిత్తూరు జిల్లాలోనూ గల్లంతైన ఓట్లు  
చిత్తూరు పట్టణంలోని బండి దొరస్వామిరెడ్డిబౌండ్‌ వీధి, డోర్‌ నెంబర్‌ 2/4లో కాపురముంటున్నారు. గతంలో పుత్తూరు గ్రామదేవత ఆరేటమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కావడంతో ఈయన పేరును ఓటర్‌ జాబితా నుంచి తొలగించేశారు. ఈయనతో పాటు ఈయన భార్య ఈశ్వరమ్మ, కుమారుడి పేర్లను కూడా తొలగించేశారు.

వైఎస్సార్‌సీపీ అభిమాని అని ఓటు తొలగించారు
‘‘గత సాధారణ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యులంతా ఓట్లు వేశాం. నేను వైఎస్సార్‌సీపీ యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా. కాకినాడలోని రమణయ్యపేట రాయుడుపాలెంలో ఉన్న నా కుటుంబంలోని ఓట్లన్నీ కుట్ర చేసి తొలగించారు. నా ఒక్కడిదే కాకుండా చాలామంది ఓట్లు ఓటరు జాబితాల్లో లేవు. కేవలం వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లు మాత్రమే ఓటరు జాబితాల్లో కనిపించడం లేదు. నా ఓటుతోపాటు మరి కొన్నిఓట్లు నమోదు చేయించగలిగాను. ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని గ్రామంలో ప్రచారం చేశాం’’  
– లింగం రవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top