మోదం.. ఖేదం

All Parties Focus On Telangana Lok Sabha Election Results - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి.

ఇందులో కాంగ్రెస్‌.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెట్టుకుంది.

అందుకు అనుగుణంగానే కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్‌ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు.
 
ఏడింట్లో మెజార్టీ రాదాయె.. 
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్‌ పార్టీకి ఊరటనిచ్చింది.

పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్‌ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్‌ఎస్‌ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top