పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేసిన అఖిలేశ్‌!

Akhilesh Yadav Dissolves All Units Of UP Samajwadi Party - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి, జిల్లా, యూత్‌వింగ్‌ విభాగాలు అన్నింటినీ రద్దు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ మినహా మిగతా నాయకులందరినీ పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో.. పార్టీ ప్రక్షాళనకై అఖిలేశ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాలో కొట్టుకుపోయిన ఎస్పీ కేవలం ఐదు లోక్‌సభ స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 ఎన్నికలకు ముందు బీఎస్పీతో జట్టుకట్టిన ఎస్పీకి అదే ఫలితం పునరావృతమైంది. ఉప ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బీజేపీ విజయం సాధించిన ఎస్పీకి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62 సీట్లు గెలుచుకుని సత్తా చాటగా, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. ఇక కనౌజ్‌ నుంచి ఎన్నికల బరిలో దిగిన అఖిలేశ్‌ భార్య డింపుల్‌ ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. 

ఈ నేపథ్యంలో పార్టీ ఘోర వైఫల్యానికి కారణాలను అన్వేషించే క్రమంలో అఖిలేశ్‌ ప్రక్షాళన చర్యలకు దిగినట్టు ఎస్పీ సీనియర్‌ నేత ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ‘ రాష్ట్ర, జిల్లా, యూత్‌ వింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాలను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ రద్దు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కార్యకర్తలు, ఆఫీస్‌ బేరర్లతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. బీజేపీ మీద పైచేయి సాధించాలంటే పార్టీలో ఉత్సాహం నింపాల్సి ఉంటుందని భావించారు. క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపడుతున్నారు. వివిధ విభాగాల ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు త్వరలోనే జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ మీడియా వింగ్‌కు చెందిన టీవీ ఛానెళ్ల అధికార ప్రతినిధులను అఖిలేశ్‌ తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యోగి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుధవారం తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించి ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టారు.

చదవండి : మంత్రివర్గ విస్తరణ; కొత్తగా 18 మందికి చోటు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top