అఖిలప్రియకు పదవీ గండం?

akhila priya minister post in danger zone

విధులపై మంత్రి నిర్లక్ష్యం

మంత్రి పేషీలో పేరుకుపోయిన ఫైళ్లు

ముఖ్య మంత్రి సమీక్షల్లో మైనస్‌ మార్కులు

మొక్కుబడిగా సమావేశాలకు హాజరు

పదవిపై అఖిల ప్రియ అసంతృప్తి

మంత్రి పనితీరుపై అధినేత సీరియస్‌

సాక్షి, అమరావతి: కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచిఉందనే వార్తలు ఏపీ తెలుగుదేశంలో గుప్పు మంటున్నాయి. విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో బాధ్యతలనుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్‌ మార్కులు పడ్డాయంట.

అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉందని పార్టీ అధిస్టానంతో పాటు, సీనియర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం.

ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్‌ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్‌ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్య మంత్రి సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్‌ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్‌ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

అయితే భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శించారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు.  ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

గతంలో అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top