ఇందూరు ఎన్నికపై 2 ఆప్షన్లు!

2 options on Induru election - Sakshi

ఈవీఎంలా? బ్యాలెట్‌ పేపరా? 

సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నాం: రజత్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో 185 మంది అభ్యర్థులున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికనిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మల్లగుల్లాలు పడుతోంది. మొదట బ్యాలెట్‌ పేపర్‌పైనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌ కుమార్‌.. ఈవీఎంలను వినియోగించే ఐచ్ఛికాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. తమ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయని శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అదనంగా కావాల్సిన కొత్త మోడల్‌ ఈవీఎంల సంఖ్యపై చర్చించామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ రూపొందించిన ఎం–3 రకం ఈవీఎంలతో మాత్ర మే.. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్‌లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. నిజామాబాద్‌ స్థానానికి 185 మంది పోటీ పడుతుండడంతో తొలుత బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని భావించామన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. కొత్తరకం ఈవీఎంలు ఎన్ని కావాలో తెలియజేయాలని ఈసీఐ కోరిందన్నారు. ఈవీఎంలు బయట నుంచి రావాల్సి ఉంటుందని, అవి వచ్చిన తర్వాత ప్రాథమిక పరీక్ష, ర్యాండమ్‌ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ బ్యాలెట్‌ పేపర్‌తోనే నిర్వహించాలనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ అయితే పేరు, ఎన్నికల గుర్తు, పార్టీ పేరుకు చోటు కల్పించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అదే విధంగా అవసరమైనన్ని బ్యాలెట్‌ బాక్సులు సమీకరించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త ఈవీఎంల అవసరాలపై నిజామాబాద్‌ కలెక్టర్‌ నుంచి నివేదిక అందిందని, అన్ని అంశాలను క్రోఢీకరించి ఈసీఐకి త్వరలో నివేదిక పంపిస్తామన్నారు. ఆ తర్వాతే ఈవీఎంలా? బ్యాలెటా? అనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top