11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత... సెకండ్‌ చాన్స్‌ దొరకని ఎంతోమంది

Since 1951, 60 Percent Lok Sabha MPs were never re-elected - Sakshi

సెకండ్‌ చాన్స్‌ దొరకని ఎంతోమంది

మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్‌ గుప్తా, సుమిత్రా మçహాజన్‌ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్‌ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు.

వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు.  ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్‌ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు.

ఆ తర్వాత అటల్‌ బిహారీ వాజపేయి, సోమనాథ్‌ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్‌ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్‌ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్‌ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్‌ ఫ్రాంక్‌ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్‌ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్‌ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్‌ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top