వస్తా..వెళ్లొస్తా..తల్లినై మళ్లొస్తా..

I Will Come Back - Sakshi

ఇక్కడే పుట్టాను..ఎక్కడో పెరుగుతాను..మళ్లీ ఇక్కడికే వచ్చి పిల్లల్ని కంటాను..అంటూ ఇప్పుడే భూమిని చీల్చుకుని బయటపడిన తాబేలు పిల్లలు తల్లి దగ్గరికి చేరేందుకు ప్రయాణం మొదలు పెట్టాయి.  పుడమి తల్లిని చీల్చుకుని భూమిపైకి వచ్చి స్వచ్ఛమైన బుడి అడుగులు వేసుకుంటూ సోదరులు, స్నేహితులతో కలిసి తన తల్లి దగ్గరకి చేరేందుకు గుంపులు గుంపులుగా లక్షలాది తాబేలు పిల్లలు సముద్రంలో కలిసిన దృశ్యం కనువిందు చేస్తోంది.

బరంపురం: రెండు రోజులుగా వరుసగా గంజాం జిల్లాలోని  రుశికుల్యా  నది బంగాళాఖాతం ముఖద్వారం తీరాన పుర్ణబొందా, గొకురకుధా, పనిగొండా ప్రాంతంలో భూమి నుంచి అరుదైన తాబేలు పిల్లలు బయటకు రావడంతో సాగర తీర ప్రదేశం ఒక్కసారిగా అందంగా మారింది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన తాబేలు పిల్లలకు ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన  గాలి స్వాగతం పలుకుతున్నాయి. గత జనవరి చివరివారం నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు ఇక్కడ తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టిన సుమారు 5 లక్షల  పిల్లలు ఇప్పటి వరకు సుమారు 3 లక్షలకి పైగా రికార్డ్‌ స్థాయిలో భూమి నుంచి బయటికి వచ్చి బుడి బుడి అడుగులు వేసుకుంటూ సాగరంలో కలుస్తున్నాయి.

 రక్షణగా ఫారెస్ట్‌ గార్డ్స్‌ 

తాబేలు పిల్లల రక్షణ కోసం సుమారు 200 మంది ఫారెస్ట్‌ గార్డులు, 200 మంది వలంటరీస్‌ను జిల్లా అటవీ శాఖ అధ్వర్యంలో నియమించారు. వారు రాత్రంతా తీరంలో ఉండి భూమి నుంచి బయటకి వచ్చిన తాబేలు పిల్లలను బకెట్లలో సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు.

నదికి అటువైపు బోట్లలో ఫారెస్ట్‌ గార్డ్స్,  వలంటీర్లు కలిసి సముద్ర తీరం వైపు వెళ్లి తాబేలు పిల్లలను వేలాదిగా సముద్రంలో విడిచిపెడుతున్నారు. తీరంలో ప్రత్యేకంగా  తాబేలు పిల్లలు ఎటు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేశారు. వల నుంచి తాబేలు పిల్లలను సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు.  

తాబేలు పిల్లలను కాకులు, గద్దలు ఎత్తుకెళ్లకుండా ఫారెస్ట్‌ గార్డ్‌లు బాంబులు పేలుస్తున్నారు.  వేళ్లే ముందు  తాబేలు పిల్లలు పిల్లగా  వెళ్తూ..తల్లినై తిరిగి ఇదే స్థలానికి వస్తానని పుడమి తల్లిని ముద్దాడి మరీ వెళ్తున్నట్లు పిల్ల తాబేలు ముచ్చట గొల్పుతున్నాయి.   

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top