అధినేతల ధోరణే అసలు సమస్య..

అధినేతల ధోరణే అసలు సమస్య..


కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరించడం వ ల్లే ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది.

 

 పదవులు, హోదాలు పొంద డంతోనే పని పూర్తికాదు. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వా త ఆ వ్యక్తి తన పాలనకు అను గుణంగా తన చుట్టూ వున్న వ్యవస్థను, విధివిధానాలను దశ, దిశను రూపొందించుకో వాలి. అవి పాలన అవసరా లకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి.

 

 ఎవరైనా మొదటి దశలోనే తను అనుకున్నవన్నీ సాధించలేరు. అతనికి ఇచ్చే స్వేచ్ఛపైనా, ప్రభుత్వం అందించే సహకారంపైనా, అతను ఏ మేరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు అనే అంశాలపైన అతని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదా హరణకు ఒక వైస్‌చాన్సలర్‌కి ఆ పదవి యిస్తే అదొక ఉద్యోగంలా వెనువెంటనే ఫైళ్ళు తిరగేసి యూనివర్సిటీ బాధ్యతలు నిర్వర్తిస్తానంటే  కుదరదు. ఎందుకంటే ఆ వీసీ గానీ మరే హోదాలో ఉన్న వ్యక్తి అయినాగానీ తనకి ఉన్న సదుపాయాల్లో ఆర్థిక వనరుల్లో తను ఏమేం చేయ గలడు. ఇంకా ప్రభుత్వ సహకారం ఏ మేరకు అవసరం, ప్రభుత్వం ఆ వీసీని పూర్తి స్వేచ్ఛగా పని చేయనిస్తోందా లేదా? లాంటి సవాలక్ష ప్రశ్నలు అతని పనిపైన ప్రభా వం చూపుతాయి. ఈ అన్ని ప్రశ్నలకూ అతనికి సాను కూల సమాధానాలు దొరికినప్పుడే ఆ యూనివర్సిటీ బాధ్యతలను అతను సక్రమంగా నెరవేర్చడం సాధ్యం అవుతుంది. అలాగే ఒక ప్రధాని కూడా గెలవడంతోనే సరిపోదు. తన ఎజెండాని ప్రజలతో ఒప్పించగలగాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల అంగీకారం లేకుండా ఏకపక్షంగా తన ఎజెండాని అమలు చేసిన కొందరు ప్రధానులు నాయకులుగా గెలిచినా పాలకులుగా ఓడిపోతారు.

 

 మన దేశ ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కు మొదట పాలనానుభవం లేదు. ఆయన రాజకీయ ఉద్యమ నాయకుడు మాత్రమే. దేశంలో మతప్రాతిపది కపై తలెత్తే పరిణామాలు సరిదిద్దుకోకపోతే దేశం విచ్ఛి న్నం అవుతుంది. ప్రజల ఎజెండాను తీసుకొని తనకు, ప్రజలకు మధ్య వారధిని ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యత, సమైక్యత పట్ల సరియైన దృక్పథం అలవర్చుకోవాలి. అందుకే నెహ్రూ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన ఎజెండాను ప్రజలతో అంగీకరింప జేసుకున్నాడు. ఆ రోజుల్లో దేశ సమైక్యతే ప్రధానమైన ఎజెండా అయింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ఒక గొడుగు కిందికి తేవ డంలో ఆయన సఫలీకృతం అయ్యారు. అనేక మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ ప్రాంతంలో ఒకలౌకికవాద పాలనను అందించడం అంత సులువేమీ కాదు. అయితే నెహ్రూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచ రణను రూపొందించుకున్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రజల కు అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రణాళికా సంఘా న్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ రష్యా అనుభ వం ఆయనకు ఒక స్ఫూర్తిగా తోడ్పడింది.

 

 అయితే ఈ రోజు దేశ నాయకత్వానికి అటువంటి దృక్పథం కొరవడింది. మతతత్వం, కుల అణచివేత, మహిళలపై దౌర్జన్యాలు, దేశ సమగ్రత ప్రధాన సమస్య లుగా మారాయి. దేశంలో ఇటీవల మైనారిటీ మత సంస్థలపై పెరిగిన దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా దేశాలు భారతదేశ వైఖరిని బహిరంగంగానే తప్పు పడుతున్నాయి. దేశంలో పదికోట్ల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళు అభద్రతా భావానికి లోనయ్యేటట్టు ప్రభుత్వాధి నేతలు ప్రవర్తించడం ప్రమాదకర ధోరణి. మైనారిటీ లను విశ్వాసంలోకి తీసుకొని రక్షణ కల్పించాల్సిన బాధ్య త మెజారిటీ ప్రజలది, ప్రభుత్వాలది. అయితే కొంత మంది మైనారిటీలు మతతత్వంతో వ్యవహరిస్తున్నారని వాదిస్తుంటారు. అయితే మైనారిటీ మతతత్వం కన్నా మెజారిటీ మతతత్వం అత్యంత ప్రమాదకరమైనది.

 

 ఈ దేశంలో కుల వివక్ష, పీడన ఎక్కడ చూసినా కనపడుతోంది. దళితులపై, ఆదివాసీలపై సాగుతున్న అత్యాచారాలు ఇందుకు ఉదాహరణ. అలాగే మహిళల కు రక్షణ కరువైంది. స్త్రీలపై పెరుగుతున్న గృహహింస కుటుంబాల విచ్ఛిన్నానికి దారితీస్తోంది. కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరిం చడం వల్ల ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. అందుకే పాలకులు ప్రజల ఎజెండాను విస్మరించకుండా, ప్రజల ఎజెండానే పాలకుల కార్యక్రమంగా మలచుకొని పాలన సాగిం చాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ప్రజాపాలకులు అవుతారు.    
 - చుక్కా రామయ్య, వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top