మనసులు దోచిన కవి ఆత్రేయ

మనసులు దోచిన కవి ఆత్రేయ


నేడు ఆచార్య ఆత్రేయ వర్ధంతి

 

తెలుగువారి మనసులు దోచిన కవి ఆత్రేయ.  దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. మనసుకవిగా ముద్ర వేసుకున్న ఆచార్య ఆత్రేయ పూర్తి పేరు ‘కిళాంబి వేంకట నరసింహాచార్యులు’. పేరులో ఆచార్యని, గోత్రంలోని ఆత్రేయను తీసుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారాయన.  1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, తెలుగువారికి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. తన కలం రుచి చూపించారు. 1988లో ఒకసారి ఆత్రేయ ‘అభినందన’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో ఇళయరాజా తన ట్యూన్‌ను ఆత్రేయకు వినిపించారు. ఆ ట్యూన్‌ను తకారంలో తీసుకుంటే... ‘తాన నాననననా తరతాన నాననననా’ ఇంత వరకు బాగానే ఉందినిపిస్తోంది. ఆ తర్వాత ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ ‘తారి తాన తాన తాన తాననా తానా...’ విని,  ఎన్ని తానాలు రా... అని ఆత్రేయ అన్నారు. అప్పుడు ఇళయరాజా ‘చూడండి గురువుగారు’ మీరు నా మ్యూజిక్‌కి తగ్గట్టు ఒక్క అక్షరం మిస్‌కాకుండా పాట రాయండి. లేకపోతే మీరు పాట రాసి ఇవ్వండి నేను ట్యూన్ చేసుకుంటాను అన్నారు.

 అప్పుడు ఇళయరాజా ట్యూన్‌కి ఒక్క అక్షరం కూడ పొల్లుపోకుండా ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం...’ అని అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఆత్రేయగారి కెరీర్‌లో వెనక్కి చూస్తే... ఆయన ట్యూన్‌కి పాటలు రాయడం చాలా అరుదు. అలాంటిది అభినందన సినిమా పాటలన్నీ ఆయన ట్యూన్స్‌కి రాయడం విశేషం. అందులో ప్రతీ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినిమా హిట్ కావడంలో ఆత్రేయగారి హస్తం ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు.    

 

 ఆచార్య ఆత్రేయ ఫ్రొఫైల్

 అసలు పేరు : కిళాంబి వేంకట నరసింహాచార్యులు

 జననం : 07-05-1921

 జన్మస్థలం : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు

 స్వస్థలం : సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు

 తల్లిదండ్రులు : సీతమ్మ, కృష్ణమాచార్యులు

 చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.

 వివాహం - భార్య : 1940 - పద్మావతి

 తొలిచిత్రం - పాట : దీక్ష (1951) -  

 పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ

 ఆఖరిచిత్రం - పాట : ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం

 పాటలు : సుమారు 1400

 దర్శకునిగా : వాగ్దానం (1961)

 నటించిన సినిమా : కోడెనాగు (1974)

 గౌరవ పురస్కారాలు : 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. తొలి కోడి కూసింది (1981) లో ‘అందమైన లోకమనీ’ పాటకు నంది అవార్డు అందుకున్నారు. ఇతరవిషయాలు : గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే  మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరంగేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటలుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.

 మరణం : 13-09-1989

 - నాగేష్

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top