చూడబోతే తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన బాహుబలికి తెలుగు వాళ్ల ప్రతిష్టకే కాక ప్రయోజనాలతో ముడిపడ్డ ప్రత్యేక హోదా అంశానికీ సారూప్యాలు కనబడుతున్నాయి.
చూడబోతే తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన బాహుబలికి తెలుగు వాళ్ల ప్రతిష్టకే కాక ప్రయోజనాలతో ముడిపడ్డ ప్రత్యేక హోదా అంశానికీ సారూప్యాలు కనబడుతున్నాయి. బాహుబలి కథ పూర్తిగా దృశ్యరూపం లో చెప్పడానికి దర్శక నిర్మాతలకు పార్ట్ 2 అవసరం అయింది. అలా అవసరమవడంలో వాళ్ల ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమైనాయంటే కాదని వాదించలేం. అది వేరే సంగతి. రెండేళ్లు సినిమాకోసం ఎదురు చూసిన ప్రేక్షకుడికి క్లైమాక్స్‌లో బాహుబలి చావడం, అదీ తనకు నమ్మకస్తుడైన సేనాని కట్టప్ప చేతిలోనే వెన్నుపోటుకి గురికావటం జీర్ణించుకోలేని విష యమైపోయింది.
వాస్తవంగా అయితే కథ సంపూర్ణత కోసం రెండో భాగం వరకు వేచి చూడవలసిన నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ప్రేక్షకుడే వెన్నుపోటుకు గురయ్యాడు. ఎంత నాజూకైన వెన్నుపోటు! అయినా అది వినోదం. ఆమోదయోగ్యం. అందుకనే సోషల్ మీడి యాలో ఒకటే గోల. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటూ ఎన్ని జోకులేసుకున్నా అసలు విషయం తెలుసుకోవడానికి టికెట్ డబ్బులు పట్టుకుని సంవత్సరం ఆగాల్సిందే.
ఇక ప్రత్యేక హోదా పరిస్థితి. విభజనలో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్‌కి బాధ నివారణకి ప్రత్యేక హోదా పూత పూస్తామని కేంద్రం సినిమా చూపించింది. ఎన్నికలయ్యాక సంవత్సరం దాటాక పార్ట్ వన్ ముగిసి నట్లుంది. బాహుబలితో సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా క్లైమాక్స్‌లో నమ్మ కస్తుడైన కట్టప్ప లాంటి (వెంకయ్య అందామా, మోదీ అందామా లేక కేంద్రం అనేద్దామా సింపుల్‌గా) పాత్ర చేతిలో ప్రత్యేక హోదా ఖూనీ. ఒక చేతిలో చట్టం రూల్స్ కత్తి, ఇంకో చేతిలో నీతి ఆయోగ్ బరిసె. అది కూడా సింబాలిక్కే. అయిందో లేదో, అవుతుందో కాదో స్పష్టంగా తేల్చక ఎవరి ఊహను వారికే వదిలేస్తూ.
అసలు కథ మాత్రం రెండో భాగం వచ్చే వరకు తేలేదిలా లేదు. మిసెస్ బాహుబలి అనుష్క. తన బాహుబలిని చంపిన కట్టప్పని వదిలేసి, భల్లాల దేవుడిపై పగపట్టి నట్లు, రాష్ట్ర ప్రభుత్వం హోదా అమలుదారుల్ని వదిలేసి చచ్చిన పాము కాంగ్రెస్‌ని పొద్దుగూకులా తిట్టిపోయడం ఎందుకో అర్థం కాదు. ఎనీవే. ఏమీ తేల్చకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటూ నానుస్తూ పోవడానికి ఇది వినోదం పంచే సినీ వ్యవహారం కాదు. విషాదం నిండిన బతుకు వ్యవహారం. ఆర్థిక దుస్థితిలో ఉన్న రాష్ట్రానికి చావు బతుకుల సమస్య. ఒకవైపు దివాలా, మరోవైపు ముంచుకొస్తున్న కరువు నేపథ్యంలో అత్యవసరంగా రాష్ట్రానికి అందాల్సిన చేయూత. తప్పనిసరిగా అమలు కావల్సిన హక్కు.
డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపి, పార్వతీపురం,
విజయనగరం జిల్లా, మొబైల్: 9440836931