'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ

TAUK Telangana Celebrations In London - Sakshi

తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర అతిథులకు తెలియజేయాలనే భావనతో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ అధ్వర్యంలో లండన్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. హరితహారం, చేనేతకు చేయూత, కాకతీయ కళాతోరణం వంటి కళాకృతుల ప్రత్యేకతతో తెలంగాణ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్, దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 'ఇండియా డే వేడుకలకు' టాక్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హైకమిషనర్‌ రుచి ఘనశ్యామ్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత, చరిత్ర, బాషా-సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్‌లో ప్రదర్శించి హాజరైన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. 


తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, సాధించిన విజయాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్టాల్‌ని ఏర్పాటు చేశామని సంస్థ కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు. చేనేతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను, టాక్ సంస్థ తన ప్రదర్శనలో ఉంచి వేర్‌ హ్యాండ్‌లూమ్‌, వీ సపోర్ట్‌ వీవర్స్‌ వంటి హ్యాష్‌టాగ్‌లను ప్రతిజ్ఞ మాదిరిగా ఫ్రేమ్‌లో ఉంచి వారి మద్దతును కోరారు. అలాగే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ దేశవ్యాప్త కార్యక్రమాన్ని కూడా తెలంగాణ స్టాల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక ప్రతిజ్ఞతో కూడిన సెల్ఫీ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించామని టాక్‌ కార్యదర్శి నవీన్ రెడ్డి తెలిపారు. స్టాల్‌ను సందర్శించిన భారత హై కమిషనర్‌ రుచి ఘనశ్యామ్, భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు ఎంపీ సంతోష్ కృషిని అభినందించి సెల్ఫీ దిగి తమ మద్దతును తెలియజేశారు.


స్టాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు, తెలంగాణ ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. కాకతీయ కళాతోరణం ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ గొప్పతనం విదేశీగడ్డపై ఉట్టిపడేలా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా నిర్మించిన టాక్ ముఖ్య నాయకులు మల్లారెడ్డిని హై కమిషనర్‌ రుచి ఘనశ్యామ్, కార్యదర్శి నారంగ్ ప్రత్యకంగా ప్రశంసించారు. టాక్ సభ్యులు భారత హై కమిషనర్‌ రుచి ఘనశ్యామ్‌ని తెలంగాణ చేనేత శాలువతో సన్మానించారు. టాక్‌ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ స్టాల్‌ని సందర్శించిన అతిథులందరికి మన హైదరాబాద్ బిర్యానీ రుచిచూపించామని నాయకులు రాకేష్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, జాయింట్ సెక్రటరీ నవీన్ రెడ్డి, ఈవెంట్స్, కల్చరల్ ఇన్‌ఛార్జి అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, సత్య చిలుముల, స్పోర్ట్స్ సెక్రటరీలు మల్లారెడ్డి, రాకేష్ పటేల్, మహిళా విభాగం సభ్యులు శుషుమ్న రెడ్డి, సుప్రజ పులుసు, శ్వేతా రెడ్డి, శ్రీలక్ష్మి, శ్రీవిద్య ఇతర టాక్ సభ్యులు రవిప్రదీప్ పులుసు, మధుసూదన్ రెడ్డి, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, వంశీ రేక్నార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top