5కే వాకథాన్‌లో మెరిసిన నటి లయ | Sakshi
Sakshi News home page

5కే వాకథాన్‌లో మెరిసిన నటి లయ

Published Tue, Feb 27 2018 11:36 AM

NATS 5k Walkthon in California - Sakshi

కాలిఫోర్నియా : నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) ఆధ్వర్యంలో నాట్స్‌ మహిళా సంబరాల్లో భాగంగా 5కే వాకథాన్ నిర్వహించారు. నూతన లాస్ ఏంజిల్స్ చాప్టర్ కార్యవర్గం పర్యవేక్షణలో దక్షిణ కాలిఫోర్నియాలోని సెర్రిటాస్‌, ఓక్‌ పార్క్‌లలో 5కే వాకథాన్ నిర్వహించారు. సెర్రిటాస్ రీజినల్‌ పార్క్‌లో నిర్వహించిన వాకథాన్ను సినీ నటి లయ ప్రారంభించారు. స్వయం వరం సినిమాలో హీరోయిన్గా నటించి లయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో బ్రహ్మలోకం టూ యమలోకం సినిమాలో పరాశక్తి పాత్రలో కనిపించిన లయ ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. నటనకు స్వస్తి పలికిన లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన విషయం తెలిసిందే.

ఫ్లోరిడాలో జరిగిన విధ్వంసకాండలో బలైన పిల్లలని గుర్తుచేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ, పిల్లల జీవితంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని లయ అన్నారు. వారితో స్నేహితులుగా మెలగాలి అని సూచించారు. అందరూ పిల్లల భవిష్యత్తు కోసం పాటు పడాలని కోరారు. 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా శ్రేయస్సు కోసం నాట్స్ చేస్తున్న ప్రయత్నాన్ని మరింతగా బలపరచాలని నాట్స్‌ మహిళా కార్యకర్తలు శిరీష పొట్లూరి, నీలిమ యాదల్లా, అనితా కొంక, అనితా కాట్రగడ్డ అన్నారు.  ఈ కార్యక్రమానికి కృషి చేసిన కార్యకర్తలను నాట్స్ లాస్ ఏంజిల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు, కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురు కొంక ధన్యవాదములు తెలిపారు. మార్చి 10న జరిగే మహిళా సంబరాలను వినూత్నంగా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు పౌరులకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ కాలిఫోర్నియాలో నివాసముంటున్న తెలుగు వారందరిని ఆహ్వానించారు. పూనమ్ మాలకొండయ్య, శ్రావ్య కళ్యాణపు, లయ గొర్తి, షెరిల్ స్పిల్లెర్ లు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలియచేశారు.

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

Advertisement
Advertisement