గంగపుత్రుల సర్వే

survey on Fisherman in nizamabad - Sakshi

పక్కాగా తేలనున్న మత్స్యకారుల లెక్క

సర్వే చేస్తున్న ప్రత్యేక బృందాలు

21 రకాల వివరాలు నమోదు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌:
జిల్లాలో మత్స్యకారుల లెక్క తేలనుంది.. గంగపుత్రుల సంక్షేమం కోసం జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్‌ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేక సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీ, రాయితీ, బీమా పరిహారం వంటివి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా మత్స్యకారుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలో సర్వే చేస్తున్నాయి. మత్స్యకారుల బీమా వంటి ప్రత్యేక పథకాలను కేంద్రం ఈ ఫెడరేషన్‌ ద్వారా అమలు చేస్తోంది. ఉదాహరణకు ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే అందించే బీమా పరిహారాన్ని ఇప్పటివరకు కుటుంబసభ్యులకు చెక్కుల రూపంలో చెల్లిస్తోంది. ఈ చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మత్స్యశాఖ అధికారులకు వచ్చేవి. వాటిని జిల్లా మత్స్యశాఖ అధికారులు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఇకపై ఇలాంటి పథకాల లబ్ధిని నేరుగా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా అధికారులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.  

ప్రత్యేక బృందాలు..
జిల్లాలో 260 మత్స్య సహకార సంఘాలుండగా, సుమారు 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో దాదాపు 1,400 మంది జలాశయ మత్స్యకారులు. వీరు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, బ్యాక్‌వాటర్‌లలో చేపలు వేటాడతారు. ఇలా 16 వేల మంది మత్స్యకారులకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపింది. జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది సహాయంతో ఈ బృందాలు మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో మత్స్యకారుడికి సంబంధించి మొత్తం 21 అంశాలను నమోదు చేసుకుంటున్నారు. పేరు, వయస్సు, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు సహకార సంఘంలోని సభ్యత్వానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు.

సంఘం పేరు, రిజిస్ట్రేషన్‌ నెంబరు, ఎన్ని సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నారు.. చేపలు పడుతున్న చెరువు పేరు, ఆ చెరువుకు ఆధారమైన నీటి వనరుల వివరాలు, మత్స్యకారుడి బ్యాంకు ఖాతా, ఆధార్‌ వంటి వివరాలను సేకరిస్తున్నారు. అయితే, జిల్లాలో ఇప్పటికే చాలా మంది మత్స్యకారుల వివరాలు మత్స్యశాఖ అధికారుల వద్ద ఉన్నాయి. ఈ వివరాలు నమోదు కాని వారి వివరాలను ఈ సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని అంతా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. కాగా జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్‌ ద్వారా మత్స్యకారులకు వృత్తి నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్‌ వంటి పథకాల అమలు చేస్తోంది. ఈ సర్వే వివరాలను సేకరించడం ద్వారా పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారునికి అందించవచ్చని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

సర్వే పూర్తవుతోంది..
మత్స్యకారుల సర్వే జిల్లాలో పూర్తి కావస్తోంది. మా శాఖ ఎఫ్‌డీవోలు, ఇతర సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు వివరాలను సేకరిస్తున్నాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించేందుకు వీలుంటుంది.  – మహిపాల్, జిల్లా మత్స్యశాఖాధికారి

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top