చీకటి దందా ! | ruling party leader illegal moran transportation in nizamabad | Sakshi
Sakshi News home page

చీకటి దందా !

Jan 14 2018 10:13 AM | Updated on Oct 17 2018 6:10 PM

ruling party leader illegal moran transportation in nizamabad - Sakshi

మొరం దందా కొత్త పుంతలు తొక్కుతోంది. కాసులకు మరిగిన మొరం మాఫియా అక్రమ రవాణాకు కొత్తదారులు వెతుకుతోంది. పగటి పూట కాకుండా.. అర్ధరాత్రి వేళల్లో మొరం రవాణాకు తెరలేపారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : రెవెన్యూ అధికారుల బృందం శుక్రవారం అర్ధరాత్రి మోపాల్‌ మండలం కంజర్‌ శివారులో నిర్వహిస్తున్న అనుమతి లేని క్వారీ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొరం తరలించేందుకు వచ్చి న తొమ్మిది టిప్పర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన అక్రమార్కులు మిగిలిన టిప్పర్లను దారి మళ్లించారు. ఈ దందాకు అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరుడు సూత్రధా రి అనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

పలుచోట్ల తవ్వకాలు..
మోపాల్‌తో పాటు, నిజామాబాద్‌ రూరల్, మాక్లూర్, ఎడపల్లి తదితర మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో భూగర్భాన్ని తొలిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టిన తవ్వకాలతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టా, ప్రభుత్వ భూములు తేడాలేకుండా విచ్చలవిడిగా తవ్వకాలను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం మొరం తవ్వకాలు జరపాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. నిర్దేశిత మొత్తంలో సీనరేజీ చెల్లించి మొరాన్ని తరలించాలి. ఇవేవీ పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లడమే కాకుండా, భూగర్భ గనులశాఖకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. నిజామాబాద్‌ నగరం, బోధన్, ఆర్మూర్‌ తదితర పట్టణాల్లో వాణిజ్య అవసరాలకు మొరం డిమాండ్‌ అధికంగా ఉంది. ఒక్కో టిప్పరుకు రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నారు. నగరంలో రియల్‌ వెంచర్లకు, ప్రైవేటు కట్టడాలకు ఈ మొరాన్ని తరలిస్తున్నారు.

క్షేత్ర స్థాయి పరిశీలనలే లేవు..
అక్రమ మొరం తవ్వకాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా టిప్పర్లను పట్టుకుని నామమాత్ర జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. కానీ మొరం తవ్వుతున్న ప్రదేశాలకు వెళ్లి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి. ఎంత పరిమాణంలో మొరాన్ని తరలించారు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన జరిమానాలు విధించాల్సి ఉంది. అలాగే కేసులు నమోదు చేసి మొరం తవ్వుతున్న జేసీబీలను, తరలిస్తున్న టిప్పర్లను కోర్టుకు అప్పగిస్తే.. అక్రమ దందాకు చెక్‌పడే అవకాశాలుంటాయి. అయితే నామమాత్ర జరిమానా విధించి వాహనాన్ని వదిలేయడం వల్ల మళ్లీ యథేచ్ఛగా ఈ అక్రమ దందాకు ఆస్కారం ఏర్పడుతోంది.    

తొమ్మిది టిప్పర్లు పట్టివేత
మోపాల్‌(నిజామాబాద్‌ రూరల్‌): మోపాల్‌ మండలంలో మొరం అక్రమ దందాపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. కంజర్‌ గ్రామశివారులో శుక్రవారం అర్ధరాత్రి మాటు వేసి క్వారీ వద్ద తొమ్మిది టిప్పర్లను పట్టుకున్నారు. వీరిని పసిగట్టిన మరో ఐదు టిప్పర్లు తప్పించుకుపోయాయి. అనుమతుల్లేకుండా మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను గతంలోనూ పట్టుకున్నప్పటికీ నామమాత్రపు జరిమానాలు విధించడంతో తిరిగి తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒకటి, రెండు టిప్పర్లు కాకుండా సుమారు 15 టిప్పర్ల ద్వారా మొరం రవాణా చేస్తుండటంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అధికారులు అర్ధరాత్రి దాడులు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిలో ఆర్‌ఐ నారాయణ, ఎస్‌ఐ సతీశ్, సీనియర్‌ అసిస్టెంట్‌ సంతోష్, వీఆర్వోలు ఇంతియాజ్, రఫీక్, సంజీవ్, పృథ్వీ, వీఆర్‌ఏలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement