
అక్రమంగా తరలిస్తూ చిక్కిన టీడీపీ నేతలు
165 బస్తాల యూరియా, రెండు వాహనాలు స్వాధీనం
దాచేపల్లి: యూరియా బస్తాలు అందక ఓ వైపు అన్నదాతలు అల్లాడిపోతుంటే మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా సరిహద్దు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 165 యూరియా బస్తాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు.
యూరియా అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా గుంటూరు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, దాచేపల్లి పోలీసులు, వ్యవసాయ అధికారి సంయుక్తంగా పొందుగల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దాచేపల్లి మండలం నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.43,972 విలువ చేసే 165 బస్తాల యూరియాని పట్టుకున్నారు.
కారంపూడిలోని నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్ షాపులో కొనుగోలు చేసి, స్థానిక రైతుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి తెలంగాణకు తరలిస్తున్నట్టు గుర్తించారు. టీడీపీ నేతలు సకినాల సురేష్, బొలగన సుధీర్, యూరియా కొనుగోలుకు సహకరించిన నంద్యాల నాగరాజు, నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్ షాపు యజమాని ఆతుకూరి నరసింహరావులపై కేసు నమోదు చేశారు.