 
													హైదరాబాద్ నుంచి టన్నుల కొద్దీ వస్తు రవాణా
రెండో రోజు వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
21 బస్సులపై కేసులు నమోదు.. రూ.69,000లకుపైగా జరిమానా
ఇదీ ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, కడప, కర్నూలు వైజాగ్, నర్సీపట్నం, తదితర ప్రాంతాలకు బయలదేరే బస్సుల్లో టన్నుల కొద్దీ సరుకును చేరవేస్తున్నారు. ఈ బస్సులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాద ఘటనలోనూ 400 మొబైల్ ఫోన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడంతో సెల్‌ఫోన్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రమాదం జరగకుండా ఉంటే ఆ బస్సులో మొబైల్ ఫోన్ల రవాణా కొనసాగేదే.
కేవలం ఆ ఒక్క బస్సులోనే కాదు..హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే చాలా బస్సుల్లో చాలావరకు ఎలక్ట్రిక్ వస్తువులు, వివిధ రకాల ఉపకరణాలు, వస్త్రాలు, ఎరువులు, ఐరన్ వంటివి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. దీంతో ప్ర యాణికులు ఉన్నా, లేకున్నా నిర్ణీత సమయం ప్రకారం ఈ బస్సు లు రాకపోకలు సాగిస్తున్నాయి. దసరా, దీపావళి తర్వాత ప్రయా ణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కానీ బస్సులు మాత్రం నిలిచిపోలేదు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇవి రాకపోకలు సాగించడానికి సరుకు రవాణాయే ప్రధాన కారణం.
పరిమితికి మించిన బరువుతో పరుగులు  
మోటారు వాహన నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ బస్సులు హైవేలో గంటకు 80 కి.మీ.వేగంతోనే రాకపోకలు సాగించాలి. కానీ ఒకవైపు ప్రయాణికులు, మరోవైపు లగేజీ బాక్సులతో పరిమితికి మించిన బరువును మోసుకుంటూ వెళ్లే ఈ బస్సులు త్వరగా గమ్యాన్ని చేరేందుకు గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుస్తున్నాయి. దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి బస్సులను అదుపు చేయలేకపోతున్నట్టు రవాణా రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, కొన్నింటిలో కేవలం ఒక్కరే బస్సు నడుపుతున్నారు. దీంతో డ్రైవర్లపైన పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బస్సు ప్రమాదాలకు అతివేగమే కారణమని అధికారులు 
పేర్కొంటున్నారు.  
కొనసాగుతున్న దాడులు 
కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ దాడులను ఉధృతం చేసింది. రెండోరోజు ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రైవేట్ బస్సులపై 21 కేసులను నమోదు చేశారు. వివిధ రకాల ఉల్లంఘనలపైన రూ.69,000లకు పైగా జరిమానా విధించారు. ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్, రంగారెడ్డి. మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రతిరోజు సుమారు 1,000 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పర్మిట్‌లులు తీసుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల కోసం నడుపుతున్న బస్సుల్లో చాలావరకు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయి. టూరిస్టులు, యాత్రికులు, తదితర కేటగిరీకి చెందిన ప్రయాణికుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు నాన్‌స్టాప్‌గా తిరగాల్సిన వాటిలో, చాలావరకు ఆర్టీసీ తరహాలో స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరమైన అపరిమితమైన ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం, హై ఓల్టేజీ విద్యుత్ వినియోగం అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. రవాణా అధికారులు రెండురోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రయాణికుల భద్రతపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి దాడులను కొనసాగిస్తున్నట్టు జేటీసీ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
