
సాక్షి, న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పెట్టుబడులు ఉపసంహరణ అవివేకమని వ్యాఖ్యానించారు. డ్రెడ్జింగ్ రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. డీసీఐని ప్రభుత్వం విక్రయిస్తే కార్మికులు రోడ్డున పడతారని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలను వెంటనే ఆపాలని, ఈ వవిషయంలో పునరాలోచించాలని నౌకాయాన మంత్రిత్వశాఖను సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.