breaking news
DCIL
-
ప్రధాని మోదీకి లేఖ రాసిన కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మంగళవారం లేఖ రాశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో 73.47 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా అమ్మాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన లేఖలో ఏమి రాశారంటే...దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనది కాదన్నారు. 41 ఏళ్ల ‘మిని రత్న’ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా లాభదాయకమైన నిర్ణయం కాదని వివరించారు. 7500 కి.మీ ల పొడవైన దేశ కోస్తా తీర ప్రాంతంలో అనేక విధాలుగా తవ్వకాలను నిర్వహిస్తున్న డీసీఐ అమ్మకం సరైంది కాదని తెలిపారు. డీసీఐ పాత్ర దేశ రక్షణలో అత్యంత కీలకమైందని, ప్రకృతి వైపరీత్యాలను, విధ్వంసాలను అరికట్టడంలో సమగ్ర తవ్వకాలను నిర్వహించడంలో డిసిఐ పాత్ర చాలా ఉందన్నారు. నిపుణులతో కూడిన కమిటీని వేసి దేశంలో డ్రెడ్జింగ్ రంగం భవిష్యత్తు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉండే ప్రభావం అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ లో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరారు. అప్పటివరకు డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని విన్నవించారు. -
‘డ్రెడ్జింగ్’ లో పెట్టుబడులు ఉపసంహరించొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పెట్టుబడులు ఉపసంహరణ అవివేకమని వ్యాఖ్యానించారు. డ్రెడ్జింగ్ రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. డీసీఐని ప్రభుత్వం విక్రయిస్తే కార్మికులు రోడ్డున పడతారని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలను వెంటనే ఆపాలని, ఈ వవిషయంలో పునరాలోచించాలని నౌకాయాన మంత్రిత్వశాఖను సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అమ్మకానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్
కేంద్రం ‘వ్యూహాత్మక’ ప్రణాళిక... కంపెనీని పూర్తిగా ప్రైవేటుపరం చేసే అవకాశం ఖజానాకు రూ.1,400 కోట్లు వస్తాయని అంచనా... మరో 4 కంపెనీల్లో 100 శాతం వాటా విక్రయంపైనా దృష్టి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్)ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు పావులు కదుపుతోంది. ప్రస్తుతం కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం 73.47 శాతం వాటాను వేలం పద్దతిలో వ్యూహాత్మక విక్రయం చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత శుక్రవారం(16న) డీసీఐఎల్ షేరు ధర బీఎస్ఈలో 1.3% లాభపడి రూ.691 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.1,935 కోట్లు. ప్రస్తుత షేరు ధర ప్రకారం73.47% వాటా అమ్మకంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1,400 కోట్లు లభించే అవకాశం ఉంది. త్వరలో కేబినెట్ ముందుకు... అదేవిధంగా మరో నాలుగు అన్–లిస్టెడ్ కంపెనీల్లో 100 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ జాబితాలో కామరాజర్ పోర్ట్, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఫార్మాసూటికల్స్ కార్పొరేషన్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ ఉన్నాయి. డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కీలక కార్యదర్శుల బృందం ఇప్పటికే ఈ ఐదు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల విక్రయానికి ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బృందానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. కాగా, ఈ ఐదు కంపెనీల డిజిన్వెస్ట్మెంట్కు నీతి ఆయోగ్ కూడా సుముఖంగానే ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదనలకు ఆమోదం కోసం త్వరలోనే ఆర్థిక వ్యవçహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్యూల్లో వ్యూహాత్మక వాటా అమ్మకాల ద్వారా ఈ ఏడాది(2017–18)లో రూ.15,000 కోట్లను సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండంచెల విధానం... మినీరత్న జాబితాలో ఉన్న డీసీఐఎల్లో మొత్తం వాటా అమ్మకం కోసం ప్రభుత్వం రెండంచెల వేలం ప్రక్రియను అమలు చేయాలని భావిస్తోంది. ముందుగా అర్హులైన బిడ్డర్లను ఎంపిక చేయడం.. ఆ తర్వాత కాంపిటీటివ్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ద్వారా అమ్మకాన్ని పూర్తిచేయాలనేది కేంద్రం యోచన. గడిచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో ఈ కంపెనీ రూ.7.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా, డీసీఐఎల్ అమ్మకంతోపాటు ఉద్యోగులకు మరింత మెరుగైన స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని(వీఆర్ఎస్) కూడా అమలు చేసే అంశాన్ని సీసీఈఏ పరిశీలించనున్నట్లు సమాచారం. డ్రెడ్జింగ్(సముద్రం, నదులు, కాలువలు వంటి నీటితో నిండిన ప్రాంతాల్లో పూడిక తీత–నౌకా మార్గాల్లో తగినంత లోతు ఉండేలా చూడటం కోసం దీన్ని చేపడతారు) అనేది వ్యూహాత్మక రంగంలోకి రానందున డీసీఐఎల్ను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.