త్వరలో రానున్న చలికాలం కూడా నగరవాసులను ముప్పుతిప్పలు పెట్టేలా కనిపిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఇటీవలే గత నవంబర్‌లో నగరంలోని కాలుష్యస్థాయి
న్యూఢిల్లీ: త్వరలో రానున్న చలికాలం కూడా నగరవాసులను ముప్పుతిప్పలు పెట్టేలా కనిపిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఇటీవలే గత నవంబర్‌లో నగరంలోని కాలుష్యస్థాయి గణాంకాలను వెల్లడించింది. వీటి ప్రకారం... జూలైలో కాలుష్య తీవ్రత హద్దులోనే ఉన్నా నవంబర్‌లో మాత్రం తీవ్రరూపం దాల్చింది. అంటే ఏటా నవంబర్‌లో రాజధానిలో కాలుష్యస్థాయి విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు అప్పుడే శీతాకాలం అడుగుపెడుతుండడంతో కాలుష్య కోరల్లో చిక్కుకున్న జనం అంత త్వరగా బయటపడడంలేదు. శీతాకాలంలో కురిసే మంచుకు గాలిలోని ధూళి తోడు కావడంతో నల్లని దట్టమైన మేఘాల్లాంటివి ఏర్పడుతున్నాయి. దీంతో కనీసం రెండుమూడు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించని దుస్థితి నెలకొంటోంది. ఉదయం ఎనిమిది దాటినా వాహనాలను లైట్లు వేసుకొని నడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
ఇవన్నీ ఒకటైతే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారి అవస్థలు ఈ సమయంలో మరింత ఎక్కువతున్నాయి. గాలిలో తేమశాతం పెరగడం, తేమకారణంగా దూళి ఎటూ కదలకపోవడం వంటి కారణాలతో శ్వాస పీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఇక ఫ్లూ వంటి వ్యాధుల జోరు సరే సరి. దీంతో శ్వాసకోశ వ్యాధులతో ఉన్నవారు శీతాకాలంలో నగర వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది జూలైలో కాలుష్యస్థాయి గతంతో పోలిస్తే మరింత పెరిగిందనేది వాతావరణ నిపుణుల అంచనా. దీంతో శీతాకాలంలో నగరవాసుల అవస్థలు కూడా రెట్టింపవుతాయని చెబుతున్నారు. పైగా ఈ ఏడాది వాతావరణంలో చోటుచేకున్న మార్పుల కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో పడలేదని, అయితే శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో ముప్పుతిప్పలు పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.