
ఆ జంట హత్యలు చేసిందెవరు?
సంచలనం రేపిన ముంబై జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ముంబై: సంచలనం రేపిన ముంబై జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. ఆర్టిస్టు హేమా ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీష్ భంబానీ అనుమానాస్పద హత్యకేసు విచారణను వేగవంతం చేశారు. మృతదేహాలపై తీవ్రగాయాలు, అర్ధనగ్నంగా పడి ఉండటం.. పైగా వారి చేతులు, కాళ్లు వెనక్కి కట్టేసి ఉండటం చూస్తే ముమ్మాటికీ హత్యగానే భావిస్తున్న పోలీసులు ఆ వైపు దృష్టిపెట్టారు. ప్రధానంగా మృతుల మొబైల్ డేటా ఆధారంగా కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులను కీలకంగా భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో కక్షగట్టిన భర్తే వీరిద్దరినీ చంపేశాడా? హేమ చివరిసారిగా కాల్ చేసిన వ్యక్తే ఆమెను హత్య చేశాడా? లేక రూ. 5 లక్షల కోసమే గోటు అనే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడా? ఇవే ఇప్పుడు తేలాల్సిన అంశాలు.
హేమ తన పెయింటింగ్స్, తదితర పనుల కోసం ఎక్కువగా ఉపయోగించే గోడౌన్ యజమాని గోటును ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 8.30 సమయంలో ఈ గోడౌన్ దగ్గర నుంచి వీరిద్దరి మొబైల్ సిగ్నల్స్ చివరిసారిగా ఉండడంతో గోటుయే ఈ హత్యకు పాల్పడి ఉంటాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు గోటుకి, హేమకి మధ్య రూ. 5 లక్షల విషయమై వివాదం ఉందని, ఈ ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హేమ అదృశ్యమైన శుక్రవారం సాయంత్రం రాజ్భర్‌తో చివరిసారిగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా హేమ భర్త చింతన్ను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు.
అటు హేమ ఇంట్లో పనిచేసే లలిత్ మండల్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. అతను అందించిన సమాచారం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఆరున్నర సమయంలో పనిమనిషి అతడికి హేమ ఫోన్ చేశారు. తాను రాత్రి భోజనానికి ఇంటికి రావట్లేదని చెప్పారు. కానీ యజమాని రాత్రి ఎంతకీ తిరగి రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కంగారుపడిన అతను, ఢిల్లీలో ఉన్న హేమ భర్తకు, ఇతర బంధువులకు, స్నేహితులకు సమాచారం అందించారు. అటు లాయర్ కూడా తన క్లయింటును కలవడానికి వెడుతున్నట్టు చెప్పినట్టు లాయర్ బంధువు తెలిపారు.
కాగా 1998లో పెళ్లి చేసుకున్న హేమ, చింతన ఉపాధ్యాయ మధ్య ఆ తర్వాత కొంత కాలానికి విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2010లో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. 2013లో తనను వేధిస్తున్నాడంటూ భర్తపై కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది హరీష్ భంబానీని తన తరఫున వాదించేందుకు నియమించుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆమెతో పాటు లాయర్ కూడా శనివారం సాయంత్రం ముంబై శివార్లలో శవాలై తేలారు.