దేశమంతా ఊదరకొడుతున్న గుజరాత్ మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ అన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవన్
వరంగల్: దేశమంతా ఊదరకొడుతున్న గుజరాత్ మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలు హన్మకొండలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభలో చర్చలు, తీర్మానాలను ఆయన విలేకరులకు వివరించారు. గుజరాత్‌లో 10 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కేటాయించారని ఆరోపించారు.
వ్యతిరేకించిన రైతులను అణచివేశారని అన్నారు. దేశంలో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ క్రమంలోనే వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2001లో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది వ్యవసాయ కార్మికులుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 16 కోట్లకు చేరుకుందన్నారు. భూమిని వ్యాపారంగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.