మైకేల్‌ను అప్పగించిన యూఏఈ

VVIP chopper scam: Middleman Christian Michel extradited - Sakshi

మంగళవారం రాత్రే   భారత్‌కు తరలింపు 

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌  కుంభకోణంలో మధ్యవర్తి 

ఫలించిన దోవల్‌ ఆపరేషన్‌ 

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్‌ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్‌ జాతీయుడైన మైకేల్‌ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్‌ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్‌ డైరెక్టర్‌ సాయి మనోహర్‌ నేతృత్వంలోని బృందం..మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్‌ వెళ్లిందని వెల్లడించింది.  

వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు..  హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్‌ పాత్ర 2012లో వెలుగుచూసింది. ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్‌ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్‌–బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ వారెంట్‌ ఆధారంగా ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి కోర్టు కొట్టివేయడంతో భారత అధికారుల శ్రమ ఫలించినట్లయింది. 

‘గాంధీ’లకు కష్టాలు తప్పవు: బీజేపీ 
మైకేల్‌ అప్పగింతతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ హెచ్చరించింది. అవినీతిపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న తిరుగులేని పోరాటానికి తాజా పరిణామమే ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది.మైకేల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, సోనియాకు మైకేల్‌ విశ్వాసపాత్రుడనే పేరుంది. 

ఏమిటీ కుంభకోణం? 
రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top