Augusta westland
-
‘అగస్టా’ మైకేల్‌ను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్(58)ను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 26 వరకు విచారించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మైకేల్ ఉంటున్న తీహార్ సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ జరగనుంది. జైల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలోగానీ, లేదా ఆయన అనుమతించిన వారి పర్యవేక్షణలోగానీ ఈ విచారణ జరగనుంది. గతేడాది డిసెంబర్లో దుబాయ్ ప్రభుత్వం ఆయనను భారత్‌కు అప్పగించింది. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మైకేల్‌ను అప్పగించిన యూఏఈ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ నేతృత్వంలోని బృందం..మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్ వెళ్లిందని వెల్లడించింది. వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు.. హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్ పాత్ర 2012లో వెలుగుచూసింది. ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్ ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి కోర్టు కొట్టివేయడంతో భారత అధికారుల శ్రమ ఫలించినట్లయింది. ‘గాంధీ’లకు కష్టాలు తప్పవు: బీజేపీ మైకేల్ అప్పగింతతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ హెచ్చరించింది. అవినీతిపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న తిరుగులేని పోరాటానికి తాజా పరిణామమే ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది.మైకేల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాకు మైకేల్ విశ్వాసపాత్రుడనే పేరుంది. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
'మా సోనియా సివంగి లాంటివారు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సివంగి లాంటివారని ఆ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు వేటిలోనూ ఆమెపేరు లేదని అన్నారు. లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నాయకులు తమ ప్రసంగాల్లో సోనియాపై పరోక్ష విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే సివంగి లాంటి సోనియా.. వీటికి భయపడబోరని సింధియా చెప్పారు. అగస్టా వెస్ట్‌లాండ్ భారతీయ కార్యాలయంలోని అధికారి పీటర్ హులెట్ రాసిన లేఖను ఆయన ప్రస్తావిస్తూ, సోనియా.. ఆమె సలహాదారులను తమ రాయబార కార్యాలయం గౌరవించాల్సి ఉందని చెప్పారన్నారు. సోనియా పేరు ఏ పత్రంలోనూ లేదని, ఎవరి సంతకాలూ లేని.. ఎవరూ ధ్రువీకరించని పత్రాల మీద మాత్రమే ఉందని తెలిపారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ కూడా తన జీవితంలో ఎప్పుడూ ఏ గాంధీనీ కలవలేదన్నారని, వాళ్ల నుంచి తనకు లేఖ గానీ, మెసేజ్ గానీ ఏమీ లేవని చెప్పారని సింధియా గుర్తుచేశారు. గాంధీలకు అసలు డబ్బు ఏవీ చెల్లించలేదని క్రిస్టియన్ మైఖేల్ గట్టిగా చెప్పారన్నారు. మిలన్ కోర్టు జడ్జి కూడా సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవనే చెప్పారని అన్నారు. -
‘రక్షణ’ దుమారం!
అధికారంలో ఉండగా వరస కుంభకోణాలతో వెలవెలబోయి సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ను స్కాంలు ఇప్పట్లో వదిలేలా లేవు. అధికార పీఠం దిగి రెండేళ్లవుతుండగా అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఆమె సహాయకుడు అహ్మద్ పటేల్ తదితరుల పాత్రపై కొత్తగా ఆరోపణలు ముసురుకున్నాయి. సాధారణంగా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో కెక్కే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పెద్దల సభలో అడుగుపెట్టిన మరుసటిరోజే ఈ స్కాంలో సోనియా పేరును ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనపై ఎన్డీఏ సర్కారును ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని షాక్. పార్టీలో ‘75 ఏళ్లకు రిటైర్మెంట్’ విధానాన్ని అమలుచేస్తూ సీనియర్లను పక్కనబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ 76 ఏళ్ల వయసున్న స్వామికి రాజ్యసభ అవకాశం ఎందుకిచ్చారో ఇప్పుడందరికీ అర్ధమై ఉంటుంది. వాస్తవానికి ఇదేమీ కొత్తగా బయటపడిన స్కాం కాదు. 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌లాండ్‌తో ఏడబ్ల్యూ-101 హెలికాప్టర్లు డజను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరడం కోసం మధ్యవర్తులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఏడాది వ్యవధిలోనే ఇటలీలో వెల్లువెత్తాయి. రూ. 3, 546 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో మొత్తంగా రూ.360 కోట్లు చేతులు మారాయని వాటి సారాంశం. అమెరికా హెలికాప్టర్ల తయారీ సంస్థ సిరోస్కీ ఉత్పత్తి చేస్తున్న ఎస్-92 సూపర్హాక్ను అధిగమించి అగస్టావెస్ట్‌లాండ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రక్షణ కొనుగోళ్లు అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఏది కొన్నా టెండర్లు పిలవడం తప్పనిసరి. అందులో ఏ సంస్థను ఎంపిక చేసినా మరో సంస్థ లొసుగులు వెదకడం షరా మామూలు. కాంట్రాక్టు చేజిక్కించుకున్న సంస్థపై నిఘా మొదల వుతుంది. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో కాంట్రాక్టు పొందిన సంస్థను ఎవరూ దెబ్బతీయలేరు. ఎక్కువ సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంది గనుకే వివాదాలు ముసురుకుంటాయి. బోఫోర్స్ మొదలుకొని దాదాపు అన్నిటా ఇదే తంతు. దళారుల ప్రమేయాన్ని అంగీకరించబోమని మన ప్రభుత్వాలు పైకి చెప్ప డమే తప్ప సొమ్ములు చేతులు మారుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. రక్షణ ఉత్పత్తుల సంస్థలు నాసిరకం పరికరాలు, ఉత్పత్తులు అంటగట్టే ప్రమాదం ఉండటమే ఇందులోని ప్రధాన సమస్య. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. మన వైమానిక దళం ఐఏఎఫ్ వినియోగిస్తున్న సోవియెట్ తయారీ ఎంఐ-8 హెలికాప్టర్లకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో మరింత సామర్థ్యంగల హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా 1999లో నిర్ణయించారు. ఆ హెలికాప్టర్ల సామర్థ్యం, ప్రమాణాలు ఎలా ఉండాలో నిర్ణయించడానికి మరో నాలుగేళ్లుపట్టింది. అవి గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగి ఉండాలని, రాత్రిపూట ప్రయాణానికి అనువుగా ఉండాలని, ఏ వాతావరణాన్నయినా తట్టుకునేలా ఉండాలని నిర్దేశించారు. 2005లో మొదటిసారి టెండర్ పిల్చినప్పుడున్న ఈ నిబంధనలు ఏడాది వ్యవధిలోనే మారాయి. అగస్టా వెస్ట్‌లాండ్‌కు అర్హత సాధించి పెట్టేందుకే ఈ మార్పులు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ముందనుకున్న ప్రమాణాలను ఎందుకు తగ్గించాల్సివచ్చిందో, ఆ మార్పులు చేసిందెవరో...వారినలా చేయమన్నదెవరో గుర్తిస్తే దర్యాప్తులో చాలా భాగం పూర్తయినట్టే. కానీ 2013లో యూపీఏ సర్కారు దర్యాప్తునకు ఆదేశించినా ఈ విషయంలో సీబీఐ రాబట్టిందేమీ లేదు. అటు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు పరిస్థితీ ఇంతే. ఎన్డీఏ సర్కారు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇటలీ ఈ విషయంలో చాలా మెరుగు. ఈ ఒప్పందంలో అయిదు కోట్ల యూరోలు ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణపై దళారి రాల్ఫ్ హష్కేను స్విట్జర్లాండ్‌లో 2012లోనే అరెస్టు చేశారు. మరి కొన్నాళ్లకే అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్మెకానికా చైర్మన్ ఓర్సీ, సీఈఓ స్పాగ్నోలినీలు సైతం కటకటాల వెనక్కు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన ఇటలీ పోలీసు విభాగం హష్కే, మరో ముగ్గురి మధ్య చోటుచేసుకున్న సంభాషణలను సైతం రికార్డు చేయగలిగింది. హెలికాప్టర్ల ఒప్పందం సాకారం కావడం కోసం చెల్లించిన ముడుపుల్ని మారిషస్, ట్యునీషియాల్లోని సంస్థల ద్వారా చేర్చామన్నది ఈ సంభాషణల సారాంశం. అంతేకాదు...భారత్‌లో దర్యాప్తు చేసే ‘మూర్ఖులు’ ఏళ్ల తరబడి శ్రమించినా వీటిని ఛేదించలేరని వారు జోకులేసు కున్నారు. కనీసం అలా అన్నందుకైనా సీబీఐ గట్టిగా పనిచేసి ఉండాల్సింది. కానీ జరిగిందేమీ లేదు. 2014 అక్టోబర్‌లో ఇటలీలోని కింది కోర్టు ఓర్సీ, స్పాగ్నోలినీలపై అవినీతి ఆరోపణలు కొట్టేసింది. అయితే ఇన్వాయిస్లు సరిగా లేవన్న ఆరోపణను అంగీకరిస్తూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. ఇటీవలే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి ముడుపులు చేతులు మారాయని నిర్ధారించింది. నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అంతేకాదు అప్పట్లో ఐఏఎఫ్ చీఫ్‌గా ఉన్న త్యాగికి ఆయన బంధువుల ద్వారా అవి అందాయని తేల్చింది. ఫలితంగానే ప్రస్తుత వివాదం రాజుకుంది. విపక్షంలో ఉన్నవారు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అధికార పక్షం కూడా ఆ పనే చేయడం సబబనిపించుకోదు. ఉన్న అధికారాన్ని వినియోగించుకుని వచ్చిన ఆరోపణలోని వాస్తవాలేమిటో తేల్చడం ముఖ్యం. గత రెండేళ్లుగా సీబీఐ ఈ విషయంలో ఎందుకు ప్రగతి సాధించలేకపోయిందో ఆరా తీసి లోటుపాట్లను సరిదిద్దడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్ర ధారులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టడం అవసరం. దీన్ని రాజకీయ కోణంలోనే చూడటంవల్లా, వాగ్యుద్ధాలకు దిగడంవల్లా దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ఇరు పక్షాలూ ఈ సంగతి గ్రహించాలి. -
దమ్ముంటే సోనియాగాంధీని అరెస్టు చేయ్!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్లో కుంభకోణంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లను టార్గెట్‌గా చేసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన దాడిని ముమ్మరం చేశారు. బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అరెస్టు చేయాలని సవాల్ చేశారు. సోనియాతోపాటు హెలికాప్టర్ల స్కాం కేసులో ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరినీ అరెస్టుచేసి, విచారించాలని ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ఈ స్కాంలో నిందితులను అరెస్టు చేసేంతా నీతి బీజేపీ వద్ద లేదని, బీజేపీ-కాంగ్రెస్ మధ్య లోపాయికారి అనుబంధముందని ఆయన విమర్శించారు. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గతంలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను విడిచిపెట్టిన బీజేపీ.. ఇప్పుడు ఈ స్కాంలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మొత్తాన్ని రక్షిస్తున్నదని విమర్శించారు. తనపై గతంలో సీబీఐ దాడులు జరిపించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై ఎందుకు ఆ దాడులు చేయించడం లేదని ప్రశ్నించారు. వీవీఐపీ కొనుగోళ్ల విషయమై అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీతో యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ ఇటలీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
నా తప్పుంటే ఉరి తీయండి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ ఒప్పందంలో తన తప్పు ఉన్నట్లు రుజువైతే తనను ఉరితీయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. బీజేపీ తనమీద చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, వాళ్లు అసలు తన పేరు ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు. అసలు తాను ఆ ఫైలుమీద ఏమీ రాయలేదని, అది తన చేతిరాత కాదని చెప్పారు. ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే వాళ్లు విచారణ చేయాలని అన్నారు. ప్రభుత్వం వద్ద ఈ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే.. వాళ్లు సభలో ప్రకటన చేయాలని మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. హెలికాప్టర్ల కాంట్రాక్టు పొందడానికి అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ దాదాపు రూ. 120-125 కోట్ల వరకు భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఇటలీ హైకోర్టు తన తీర్పులో నిర్ధారించడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అగస్టా సంస్థ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆయన సన్నిహితుడు అహ్మద్ పటేల్, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులతో లాబీయింగ్ చేసినట్లు కోర్టు తన పరిశీలనలో తెలిపింది. -
'అగస్టా' కేసులో గవర్నర్‌ను విచారించిన సీబీఐ
-
గవర్నర్‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు
-
గవర్నర్‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో గవర్నర్ నరసింహన్‌ను సీబీఐ అధికారులు బుధవారం విచారిస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. నరసింహన్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2005 లో ఈ ఒప్పందం కుదిరినప్పుడు నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలు కీలకమయ్యాయని సీబీఐ భావిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీబీఐ అధికారుల బృందం గవర్నర్ ఇచ్చే వివరాలను సేకరించనుంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 3,700 కోట్ల రూపాయలకుపైబడి ఈ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా వాంఛూ ఎస్పీజీ చీఫ్‌గా కొనసాగారు. సీబీఐ విచారణ అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేశారు. -
అగస్టా దెబ్బకు మరో వికెట్ పడింది!!
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లు కొనాలని ఏ ముహూర్తంలో నిర్ణయించారో గానీ.. ఆ ఒప్పందం వరుసపెట్టి గవర్నర్లను బలిగొంటూనే ఉంది. నిన్న కాక మొన్న సీబీఐ ప్రశ్నించడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామా చేయగా.. తాజాగా గోవా గవర్నర్ బీవీ వాంఛూ కూడా తన పదవిని వదులుకున్నారు. వీవీఐపీల కోసం 12 అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో.. ఆ కేసును సీబీఐ విచారణకు చేపట్టింది. ఈ కేసులో వాంఛూను సాక్షిగా సీబీఐ విచారించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన వాంఛూ కాంగ్రెస్ అగ్రనేతల కుటుంబానికి సన్నిహితునిగా పేరొందారు. అప్పట్లో ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి అధినేతగా ఉండేవారు.ఇది ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది. ఈ హోదాలో వాంఛూ కూడా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భాగం పంచుకున్నారు. -
అగస్టా వ్యవహారంపై కడిగేసిన కాగ్
అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు అంశంలో రక్షణ శాఖ అనుసరించిన విధానాలను కాగ్ కడిగిపారేసింది. అసలు ఆ కంపెనీయే 3,966 కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చినప్పుడు, రక్షణశాఖ 4,871.50 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చిందని నిలదీసింది. రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగం మొత్తం 12 హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని కాగ్ విమర్శించింది. ఈ ఒప్పందం విషయంలో పలు సందర్భాల్లో సేకరణ విధానం, టెండర్ల విధానాలను రక్షణ శాఖ అతిక్రమించినట్లు తెలిపింది. అంతేకాక.. 2007 సంవత్సరంలో ఈ హెలికాప్టర్లకు సంబంధించిన పరీక్షలను విదేశాల్లో నిర్వహించాలని నాటి వైమానిక దళ ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కాగ్ ప్రశ్నించింది.