సంగీత దిగ్గజం ఖయ్యాం కన్నుమూత

Veteran music composer Mohammed Zahur Khayyam Hashmi passes away - Sakshi

ముంబై: బాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు, పద్మభూషణ్‌ గ్రహీత మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యాం హష్మి(93) సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఖయ్యాం ముంబైలోని సుజయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 28న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌ అమర్చారు. అయితే సోమవారం రాత్రి 9.30 గంటలకు కార్డియాక్‌ అరెస్ట్‌(గుండె ఆగిపోవడం)తో ఖయ్యాం తుదిశ్వాస విడిచారని సన్నిహితవర్గాలు తెలిపాయి. లూథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యాం సంగీత ప్రయాణం మొదలైంది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో ఖయ్యాం పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ ఖయ్యాంను జాతీయ అవార్డు వరించింది. కభీకభీ, ఉమ్రావ్‌ జాన్‌ సినిమాలకు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా దక్కాయి. ఆయనకు 2007లో సంగీత నాటక అకాడమి అవార్డు వరించింది. అంతేకాకుండా 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో ఖయ్యాంను సత్కరించింది. కాగా, ఖయ్యాం మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top