111 కేజీల బంగారం పట్టివేత 

Vehicle carrying  3 Point 6 crore worth gold detained - Sakshi

సాక్షి, చెన్నై: ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజే తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో 111 కేజీలకు పైగా బంగారం పట్టుబడింది. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 లోక్‌సభ, 19 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఏప్రిల్‌ 18వ తేదీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కరూర్‌ జిల్లా అరవచ్చకుడి వద్ద వేకువజామున ఓ వాహనంలో 95 కేజీల బంగారం బయట పడింది. సేలంలోని ప్రముఖ జ్యువెలరీస్‌కు దీనిని తరలిస్తున్నట్టు సిబ్బంది పేర్కొన్నారు.

రుజువులు చూపలేకపోవడంతో సీజ్‌ చేశారు. వేలూరు సమీపంలోని చిట్టంపట్టి వద్ద అధికారులు ఓ వాహనంలో ఉన్న 12 కేజీల బంగారం, ఐదు కేజీల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.64 కోట్లుగా తేల్చారు. ఎలాంటి రికార్డులు లేకుండా వీటిని తరలిస్తుండటంతోనే సీజ్‌ చేసినట్లు తెలిపారు. అలాగే, కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు తిరుపతి నుంచి వచ్చిన ఓ ప్రైవేటు మినీ బస్సులో ప్రయాణిస్తున్న రామనాథపురానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ వద్ద రూ.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో పోలీసులు నలుగురు ప్రయాణికుల నుంచి 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top