నాడు ముందస్తు దెబ్బతీసింది..!

Vajpayee sensed defeat in 2004 LS polls - Sakshi

2004 ఓటమిని వాజ్‌పేయి ముందే ఊహించారు

ప్రస్తుత ప్రభుత్వం బాగా పనిచేస్తోంది

న్యూఢిల్లీ: 2004 లోక్‌సభ ఎన్నికల ప్రచారం అనంతరం.. ఆ ఎన్నికల్లో ఓటమిని నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ముందే ఊహించారట. ప్రచారం చివరి రోజు ప్రచార కార్యక్రమాలన్నీ ముగించుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చాక.. ‘మనం ఓడిపోతున్నాం. ఈ ప్రభుత్వం ఇక ఉండదు’ అని అన్నారట. ఈ విషయాలను వాజ్‌పేయికి అత్యంత విశ్వసనీయుడైన సహచరుడు శివకుమార్‌ పారీక్‌ తాజాగా ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మనం ఓడిపోం.. ఎందుకు ఓడిపోతాం?’ అని ప్రశ్నించగా.. ‘ఏ లోకంలో ఉన్నావు? ఇప్పటిదాకా ప్రజల మధ్య ఉండి, ప్రచారం చేసి వచ్చాను.

నాకు తెలియదా?’ అని వాజ్‌పేయి సమాధానమిచ్చారని పారీక్‌ తెలిపారు. 2004లో ఓటమిని విశ్లేషిస్తూ.. ‘ఇండియా షైనింగ్‌(భారత్‌ మెరుస్తోంది) అనే నినాదం మాకు ప్రతికూలంగా మారింది. ముందస్తు ఎన్నికల నిర్ణయం కూడా దెబ్బతీసింది. నిజానికి ముం దస్తుకు వెళ్లాలని అటల్‌జీకి లేదు. కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది’ అని ఆయన చెప్పారు. పార్టీకి, కార్యకర్తల మధ్య సమన్వయం వాజ్‌పేయి హయాంలో మాదిరి ఇప్పుడు లేదని ఆయన తేల్చిచెప్పారు. వాజ్‌పేయి చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోందా? అన్న ప్రశ్నకు.. మోదీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, వాజ్‌పేయి చూపిన మార్గంలోనే వెళ్తోందని అన్నారు.

‘అటల్‌జీ మార్గంలో వెళ్లడమంటే ఆయన జీవన విధానాన్ని అనుసరించడం, ప్రధానిగా ఇతరులతో ఆయన ఎలా ఉండేవారో అలా ఉండటం’ అని వ్యాఖ్యానించారు. పార్టీకి వాజ్‌పేయి వేసిన పునాదులు బలంగా ఉండటం వల్లనే 2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించగలిగిందని, ఇప్పుడు 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని శివకుమార్‌ వ్యాఖ్యానించారు. ‘రానున్న ఎన్నికల్లో కూడా సంఖ్య తగ్గొచ్చు కానీ విజయం బీజేపీదే’ అన్నారు. ‘శ్రీరాముని ఆదర్శాలు, శ్రీకృష్ణుడి శక్తిసామర్థ్యాలు, చాణక్యుడి విధానాలను ఒక్కరిలోనే చూడాలనుకుంటే అది వాజ్‌పేయిలోనే చూడొచ్చు’ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాక సినిమాలు చూస్తూ, పాటలు వింటూ, మరాఠీ నాటకాలు చూస్తూ వాజ్‌పేయి కాలం గడిపారన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top