దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం - Sakshi


న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గాల్సింది పోయి కొంచెం పెరిగిందని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే 2013-–2014 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కార్మిక శక్తితో 4.9 శాతం ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5 శాతానికి చేరుకుంది. నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, రోడ్లు, విద్యుత్‌ను అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని, దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చి దిద్దుతామని, టెర్రరిజాన్ని తుదముట్టిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా హామీ ఇచ్చింది.



బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ వారంతో మూడేళ్లవుతున్న సందర్భంగా ఈ ప్రధాన అంశాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ‘ఇండియా స్పెండ్‌’ సంస్థ విశ్లేషించింది. పదేళ్ల యూపీఏ పాలనలో అదుపుతప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని, కొత్త ఉద్యోగాల సృష్టికి, వ్యాపారాల అభివద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. బీజేపీ అధికారంలోకి వస్తే కోటీ ఉద్యోగాలను కొత్తగా తీసుకొస్తామని ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా హామీ ఇచ్చారు.



2014 జూలై నుంచి 2016 డిసెంబర్‌ మధ్య కాలంలో ఉత్పత్తులు, వాణిజ్యం, భవన నిర్మాణం, విద్యా, ఆరోగ్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, వసతి, రెస్టారెంట్‌ రంగాల్లో 6,41,000 కొత్తగా ఉద్యోగాలు పెరిగాయని, మొత్తంగా నిరుద్యోగ సమస్య ఐదు శాతానికి చేరుకుందని 2015–16 ఆర్థిక సంవత్సరంలో వార్షిక నిరుద్యోగంపై జరిపిన ఐదవ ఆర్థిక సర్వే వెల్లడించింది.



ఆ తర్వాత 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు తెలియనప్పటికీ, ఉద్యోగ పురోగతి సవ్యంగా లేదని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే యూపీఏ అధికారంలోవున్న 2011 జూలై నుంచి 2013 డిసెంబర్‌ నాటికి, రెండేళ్ల కాలంలో 12 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్ల కాలంలో అందులో సగం ఉద్యోగాలకే కొత్తగా సష్టించగలిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top