థాంక్యూ సుప్రీంకోర్ట్‌...

Transgender Opinion On Supreme Court Verdict - Sakshi

భారతీయ స్వలింగ సంపర్కుడిగా నన్ను నేను తొలుచుకుని ప్రపంచం ముందుకొస్తున్నాను!
 నా యవ్వనమంతా అనుమానం, అనిశ్చితితో కూడుకున్న సందేహాలతో నిండిఉంది.
అందరిలా కాకుండా నేను ‘వేరే’ అని నాకు తెలుసు కానీ తెలియందల్లా ఎందుకిలా? అన్నదే.

నా చుట్టూ ఉన్న వాళ్ళు ‘ఒరేయ్‌ హిజ్రా’ అంటూ గేలిచేసినప్పుడు నా సందేహం బద్దలైంది. 
నా సహ విద్యార్థుల నుంచి, నా ఆటల నుంచి, పాటల నుంచి మొత్తంగా నన్నది వేరు చేసింది. 
క్రమంగా నాకిష్టమైన అన్నింటినుంచీ నన్ను దూరం చేసి, నన్నొంటరిని మిగిల్చింది.

నేనెందుకిలా ఒంటరినయ్యాను. నేనందరిలా ఎందుకు లేను? నాకెందుకీ శిక్ష? ఆ మానసిక స్థితిలోంచి బయటపడేందుకు కఠోరతపస్సు చేయాలి.  నాలాంటి వారే నా చుట్టూ ఉన్నవారు నాలాగే వేరుగా ఉన్నవారు వారెందుకిలా ఉన్నారో అర్థం కాక, చెప్పేవారు లేక కనీస లైంగికపరిజ్ఞానం కరువై తమలో తామే నలిగిపోయి మృత్యువును కోరితెచ్చుకుంటుంటే నిశ్చేష్టుడిలా మిగిలిపోయాను. నా సందేహాలకు ఇంటర్నెట్‌ని శరణుకోరాను. అప్పుడర్థం అయ్యింది వేనవేల గేల బేల చూపులతో ఈ ప్రపంచం నిశ్శబ్దంగా నిండిఉన్నదని. అలాంటి విశాల ప్రపంచంలో మన దేశం ఆచూకీ నాకేదీ దొరకలేదు.

బహుశా అది ‘మన’ సంస్కృతి కాదేమోనని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి నేనుగా ఉండడం మానేసాను. సహజంగా నాకిష్టమైనవన్నీ చేయడం ఆపేసాను. గత చాలా కాలంగా నా పని ఒక్కటే. అదే అవమానాలనుంచి, అసహ్యపు చూపులనుంచి, వెలివేతల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉండడం. మేమంతా ఓ ఆత్మన్యూనతా భావంలో, అభద్రతా భావంలో కూరుకుపోయాం. ఆత్మగౌరవం కోసం స్వలింగ సంపర్కుల పోరాటం మాకు కొత్తసవాళ్ళను ఎదుర్కొనే శక్తినిచ్చిందే తప్ప పరిస్థితుల్లో  పెద్దగా మార్పుతీసుకురాలేదు. తీర్పులూ మమ్మల్ని సేదతీర్చలేదు. అదే వేధింపులు, అవే భయాలూ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. 

కానీ ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టిన రోజు.  మా దేహాల గాయాల నుంచి తొలుచుకుని మేం మేముగా నిలిచిన రోజు. సుప్రీంకోర్టు తీర్పుతో గొంగళిపురుగు దశనుంచి రెక్కలువిప్పుకున్న సీతాకోక చిలుకల్లా మేం మా రంగుల ప్రపంచంలోకి సగర్వంగా రెక్కలల్లార్చుకుని ఎగిరిపోయే రోజు. అయినా మాముందు ఇంకా అవమానాల మూకలు నిలిచే ఉన్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు మిగిలేవున్నాయి. రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చెప్పినట్టు ‘‘నేను ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’. 

‘‘నన్ను నమ్మండి. మీరిక ఒంటరి కాదు’’. దేశంలోని స్వలింగ సంపర్కులందరికీ ఈ సందేశం అందాలి. ఇంకా మమ్మల్ని అంగీకరించలేని వారికి ఓ చిన్న మాట.... ‘‘అవును మేం స్వలింగ సంపర్కులం. మేమిక్కడే ఉన్నాం. మేం అదృశ్యం కాము.’’

ఇట్లు 
సంజయ్‌ దేశ్‌పాండే, వయస్సు 26
న్యూఢిల్లీ వాస్తవ్యుడు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top