పని కావాలంటే..‘పని’ రావాలి!

Times Job Survey On Getting Jobs - Sakshi

ఉద్యోగాలకు డిగ్రీల కంటే పనితనమే ముఖ్యం

ప్రొఫెషనల్‌ కోర్సులు కూడా అవసరం

టైమ్స్‌జాబ్స్‌ ప్రత్యేక సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగం రావాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, నైపుణ్యం కూడా ముఖ్యమని ‘టైమ్స్‌జాబ్స్‌’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. కంపెనీలకు పనితనమే ప్రధాన కొలమానం అని తేలింది. స్వాతంత్య్రానంతర ఉద్యోగ నియామక ధోరణులపై జరిగిన ఈ సర్వే విద్యార్హత కన్నా నైపుణ్యమే మిన్న అనే విషయాన్ని రుజువు చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలో నైపుణ్యాల స్థాయి మెరుగుపడింది. నైపుణ్యం ఉంటే నౌకరీ దక్కుతుందని 53 శాతం మంది మానవ వనరుల (హెచ్‌ఆర్‌) విభాగ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఉద్యోగపరంగా పరిగణనలోకి తీసుకునే అంశాల్లో విద్యార్హతను వారు ఆఖరికి నెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ప్రొఫెషనల్‌ డిగ్రీ లేదా సర్టిఫికెట్‌ కోర్సు అవసరమని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

విశ్లేషణా సామర్థ్యమే ముఖ్యం..

‘టైమ్స్‌జాబ్స్‌’ తన సర్వేలో భాగంగా మొత్తం వెయ్యి మందికి పైగా హెచ్‌ఆర్‌ మేనేజర్ల అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం విశ్లేషణా నైపుణ్యాలకు సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇక మేధోజ్ఞానం, సామాజికాంశాలపై పట్టు, ఈఐ (ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి వాటిని ద్వితీయాంశాలుగానే పరిగణిస్తున్నాయి. 
బహుళజాతి కంపెనీలు ఉద్యోగ కల్పనలో ముందున్నాయి. దేశానికి మరిన్ని బహుళ జాతి కంపెనీలు తరలిరావడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగాయని అత్యధికులు (49 శాతం) అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో పెట్టిన పెట్టుబడులు (24 శాతం), ఉద్యోగాల కల్పన దిశగా చేపట్టిన సంస్కరణలు (14 శాతం) ఉపాధికి దోహదపడ్డాయని కొందరు భావిస్తున్నారు.
నైపుణ్యం ఉన్నా మానవ వనరులు అందుబాటులోకి రావడం కూడా ఉద్యోగాలు పెరిగేందుకు దోహదపడిందని ఆరు శాతం మంది భావిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఇతర కారణాలు చూపుతున్నారు. 
ఇక వృత్తి సంబంధిత పోటీ తీవ్రమైనట్లు సర్వేలో వెల్లడైంది. నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవడం, ‘కెరీర్‌ రొటేషన్‌’ (వివిధ రకాల విధులు చేపడుతుండటం) వంటి అంశాలను ప్రస్తావించింది. 
గత 71 ఏళ్లలో ఉద్యోగాల కల్పనపరంగా, విస్తృతిపరంగా జాబ్‌ మార్కెట్‌ మెరుగైందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్వాతంత్య్రానంతరం భారత్‌ మరిన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

స్త్రీల పట్ల అనుకూలత..
స్త్రీలకు సంబంధించి సంప్రదాయ ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. కార్పొరేట్‌ రంగంలో స్త్రీలు సృష్టించిన మార్పులను గుర్తించింది. నాయకత్వ స్థానాల్లో కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని స్త్రీలు తిప్పి కొట్టగలుగుతున్నారనే అభిప్రాయాన్ని 41 శాతం మందికి పైగా వ్యక్తం చేశారు. ఇక వృత్తుల ఎంపిక విషయంలో స్త్రీలు తమ పరిధిని విస్తరించుకుంటున్నారని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top