భవిష్యత్‌ తరాలపై ప్రభావం

Sunni Central Wakf board offers a surprise settlement in Ayodhya case - Sakshi

అయోధ్య కేసులో సుప్రీంకోర్టుకు ముస్లిం వర్గాల లిఖితపూర్వక అభ్యర్థన

న్యూఢిల్లీ: సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపుతుందని సున్నీ వక్ఫ్‌ బోర్డు సహా ముస్లింల తరఫు కక్షిదారులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా, లిఖిత పూర్వకంగా సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌కు వారు సోమవారం సమర్పించారు. ‘ఆ కాపీ సీల్డ్‌ కవర్‌లో నాముందుంది. కానీ అందులోని అంశాలు ఈరోజు పత్రికలో పతాక శీర్షికలో వచ్చాయి’ జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు. ‘ఈ కోర్టు ఇచ్చే తీర్పు ఏదైనా.. దాని ప్రభావం భవిష్యత్‌ తరాలపై ఉంటుంది. తీర్పు పరిణామాలు దేశ రాజకీయాలపై కనిపిస్తాయి.

1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పుడు ఆమోదించిన రాజ్యాంగవిలువలపై విశ్వాసం ఉన్న ప్రజల ఆలోచనలపై ఈ కోర్టు నిర్ణయం ప్రబల ప్రభావం చూపుతుంది’ అని ఆ కాపీలో పేర్కొన్నారు. ఆ కాపీని ముస్లింల తరఫు వాదించిన సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ రూపొందించారు. ‘సమాజంపై ఈ తీర్పు చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ  చరిత్రాత్మక తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేసి, దేశం నమ్ముతున్న రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా తీర్పు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం’ అని అందులో అభ్యర్థించారు. తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా పేర్కొంటూ హిందూ వర్గాలు శనివారమే తమ కాపీలను సుప్రీంకోర్టుకు అందించాయి. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేస్తున్నారని రామ్‌ లల్లా తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ తాను రూపొందించిన కాపీలో పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top