
క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టే..!
క్రమశిక్షణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు.
జైట్లీపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్
న్యూఢిల్లీ: క్రమశిక్షణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. ‘కొందరు అడగకుండానే సలహాలిస్తున్నారు. నేను ఒకవేళ క్రమ శిక్షణను ఉల్లంఘించి ఉంటే పర్యవసానాలు మరోలా ఉండేవన్న సంగతి వారికి తెలియదు’ అని జైట్లీ పేరును ప్రస్తావిం చకుండా ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లను స్వామి విమర్శించడం తెలిసిందే. దీంతో క్రమశిక్షణతో, విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించాలని స్వామికి జైట్లీ సూచించారు. దీనిపై స్వామి ట్విటర్‌లో స్పందించారు.
విదేశాలకు వెళ్లే కేంద్ర మంత్రులు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించాలని బీజేపీ పెద్దలను కోరారు. కోటు ధరించి, టై కట్టుకుంటే మంత్రులు వెయిటర్లలా కనబడుతున్నారని.. బ్యాంక్ ఆఫ్ చైనా చైర్మన్ గౌలీతో జైట్లీ దిగిన ఫొటోలనుద్దేశించి మరో ట్వీట్ చేశారు. స్వామి వ్యాఖ్యలపై బీజేపీ అసంతృప్తితో ఉంది.