ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకెళ్తామన్నారు | Seemandhra region Ministers, MPs urge Cong to reconsider Telangana decision | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకెళ్తామన్నారు

Sep 19 2013 2:11 AM | Updated on Sep 1 2017 10:50 PM

ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకెళ్తామన్నారు

ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకెళ్తామన్నారు

రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం వచ్చే వరకు విభజన ప్రక్రియ ముందుకు పోదని ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ స్పష్టంచేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం వచ్చే వరకు విభజన ప్రక్రియ ముందుకు పోదని ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ స్పష్టంచేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలపై ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చే వరకు విభజనపై కేబినెట్ నోట్ వచ్చే అవకాశాలు లేవని తెలిపారు. ఆంటోనీ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని గుర్తించామని, ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్తానని అహ్మద్ పటేల్ హామీ ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణపై కేబినెట్ పరిశీలన కోసం హోం శాఖ ఇప్పట్లో ఎలాంటి నోట్‌ను సమర్పించే అవకాశం లేదన్న ధీమా వ్యక్తం చేశారు.

 

హోంశాఖ నోట్ ఆధారంగా మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని (జీవోఎం) ఏర్పాటు చేసి విభజనపై విధివిధానాలు రూపొందించే బాధ్యతను అప్పగించవచ్చని ఇప్పటివరకు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తాజా పరిణామాలతో శుక్రవారం జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు వీరప్ప మొయిలీతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు.

 

అనంతరం  సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌లతోనూ సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బృందంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి సాకే శైలజానాథ్ ఉన్నారు. ‘‘సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను గుర్తించాం. ఆ ఉద్యమం దృష్ట్యానే కాంగ్రెస్ అధిష్టానం కమిటీ వేసింది. కమిటీ అన్ని అంశాలపై విచారించింది. ఉద్యమ తీవ్రత నేపథ్యంలో విభజన ప్రక్రియపై కేంద్రం ముందుకు పోలేదు..పోదు’’ అని మొయిలీ తమతో అన్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర ఉద్య మం, అక్కడి పరిస్థితులపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఆంటోనీ కమిటీలోని మిగతా సభ్యులతోనూ మాట్లాడతానని మొయిలీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
 ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం..
 
 సీమాంధ్రలో 50 రోజులుగా జరుగుతున్న ఉద్యమ ఉధృతిని, అక్కడి ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, కిల్లి, జేడీ శీలంలు మొయిలీకి తెలిపారు. ఏ పార్టీ ప్రమేయం లేకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారని, ఉద్యోగులు, విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి ఉద్యమిస్తున్నారని చెప్పారు. విభజనపై తీసుకున్న నిర్ణయం పార్టీకి ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తుందన్న అంశంపై వివరించారు. ఇటీవల తమ నియోజకవర్గాల్లో పర్యటన సమయంలో ప్రజల నుంచి తమకు తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు మంత్రులు కావూరి, కిల్లి కృపారాణి పేర్కొన్నారు.
 
 పజలంతా కాంగ్రెస్ పార్టీని దోషిగా చూస్తున్నారని, ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని  చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. హైదరాబాద్ అంశాన్ని సైతం ప్రస్తావిస్తూ.. అక్కడి సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించే ప్రయత్నాలు జరగాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో విభజనపై ముందుకెళ్లడం మంచిది కాదని నేతలు కోరినట్లుగా తెలిసింది. హైదరాబాద్ అంశం కంటే రాయలసీమవాసులకు నీటి సమస్య తీవ్రమైందని, సమస్యలకు సరైన పరిష్కారాలు చూపకుండానే రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించే సమస్యే లేదని ఎంపీ అనంత చెప్పినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరినట్లు తెలిసింది. ఏపీఎన్జీవోల నుంచి తమపై కేంద్రమంత్రి పదవులకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతోందని, నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఉందని ఎంపీ సాయిప్రతాప్.. ఆంటోనీకి చెప్పారు. ఈ సందర్భంగా మహిళా కేంద్రమంత్రి ఒకరు జోక్యం చేసుకుంటూ.. తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోనని అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
 
 మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని ఒత్తిడి చేసే హక్కు ఎన్జీవోలకు ఎక్కడిదని, వారు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారా అని ఆమె ఆగ్రహంగా ప్రశ్నించారు. నేతలు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మొయిలీ స్పందిస్తూ.. ఆంటోనీ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోందని, సీమాంధ్ర ఉద్యమ ఉధృతి దృష్ట్యానే కేంద్రం విభజన ప్రక్రియను నెమ్మది చేసిందని అన్నట్లు చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకు కేబినెట్‌లో తెలంగాణ నోట్ వచ్చే అవకాశం లేదని కూడా మొయిలీ అన్నట్లు చెబుతున్నారు. మొయిలీతో భేటీ తర్వాత అహ్మద్ పటేల్‌ను కలిసిన నేతలు.. సీమాం ధ్రలో పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా అహ్మద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణపై వెనక్కి వెళ్లలేం, అలాగని ముందుకు కూడా వెళ్లలేమని వారితో అన్నట్లు సమాచారం. తెలంగాణపై వెనక్కి వెళ్తే ఆ ప్రాంతంలో ఉద్యమం ఎగిసిపడే అవకాశం ఉందని అన్నారు. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపండి అంటూ నేతలను అడిగినట్లు తెలిసింది.
 
 సోనియా, ప్రధానిని కలుస్తాం: ఎంపీ అనంత
 
 పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం నేతలంతా తమతమ నిజయోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం అక్కడి పరిస్థితులు, ప్రజల మనోభావాలు ఏమిటో గమనించామని, వాటిని మొయిలీకి తెలిపామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢ నిశ్చయంతో అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారని, ఈ దృష్ట్యా విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని గట్టిగా కోరినట్లు తెలిపారు. దీనిపై ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందని,  విభజనపై ఏకాభిప్రాయం వచ్చేవరకు ప్రక్రియ ముందుకు వెళ్లదని మొయిలీ స్పష్టంగా చెప్పారని వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్, పార్టీ అధినేత్రి సోనియాను కలుస్తామని తెలిపారు.
 
 రాష్ట్రపతితో ఉండవల్లి భేటీ
 
 రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీర్మానించినప్పట్నుంచీ సీమాంధ్ర అగ్నిగుండంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారని వివరించారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా గణనీయంగా రాష్ట్రం సమైక్యంగానే కొనసాగాలని కోరుకొంటున్నారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement