ఆధార్ సీడింగ్ తప్పనిసరి | Seeding of Aadhar is necessory | Sakshi
Sakshi News home page

ఆధార్ సీడింగ్ తప్పనిసరి

Feb 17 2014 2:32 AM | Updated on Sep 2 2018 5:20 PM

వంట గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆధార్‌కార్డు నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా.., ఆధార్‌తో సంక్షేమ పథకాలను అనుసంధానం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం ససేమిరా అంటోంది.

 సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆధార్‌కార్డు నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా.., ఆధార్‌తో సంక్షేమ పథకాలను అనుసంధానం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం ససేమిరా అంటోంది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరికీ ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది. కూలీలకు ఉన్న ఆధార్ కార్డుల నంబర్లను విధిగా అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. అందులో భాగంగా పైలట్ ప్రాజె క్టు కింద దేశంలో 252 జిల్లాలను గుర్తిస్తే.. మన రాష్ట్రంలో 22 జిల్లాలను ఎంపిక చేశారు. 
 
ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం లేని గ్రామాల్లోని కూలీల ఆధార్ నంబర్ల సీడింగ్ కోసం ఏకంగా ఆయా గ్రామాల్లోని గ్రామీణ్ రోజ్‌గార్ సహాయక్ (జీఆర్ ఎస్)లకు టాబ్లెట్ పీసీలను సరఫరా చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. నెట్ సౌకర్యం లేని గ్రామాల జాబితాను ఈనెల 24వ  తేదీలోపు పంపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
 
దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 252 జిల్లాల కోసం పదివేల టాబ్లెట్స్‌ను పంపిణీ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) సంస్థ నిధులు సమకూర్చడానికి అంగీకరించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో టాబ్లెట్ పీసీకి పదివేల రూపాయలు ఖర్చు చేస్తారు. లేదా అంతకంటే తక్కువ రేటుతో టాబ్లెట్ కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించారు. పదివేల కంటే ఎక్కువ గ్రామాలకు ఈ టాబ్లెట్‌లు కావాలన్న డిమాండ్ వస్తే..మొదట దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత క్రమంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు.
 
టాబ్లెట్‌లకు సిమ్ ఆధారంగా జీపీఆర్‌ఎస్ సౌకర్యం ఉండాలని, ఆయా గ్రామాల నుంచి ఉపాధి కూలీల జాబ్‌కార్డుతోపాటు, వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేసి, కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఈజీఎస్ సాఫ్ట్‌వేర్‌కు నేరుగా పంపించాల్సి ఉంటుందని వివరించారు. నెట్ కనెక్షన్ లేనిచోట మొబైల్ సౌకర్యం ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతించిన తరువాత..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని లేఖలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement