‘సెక్షన్‌ 497’పై తీర్పు వాయిదా

SC reserves verdict on PIL seeking scrapping of Section 497 - Sakshi

న్యూఢిల్లీ: వ్యభిచార చట్టం చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ముగించి, తీర్పును రిజర్వులో ఉంచింది. చివరి రోజైన బుధవారం కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ వాదనలు వినిపించారు. సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వివాదాస్పద ఐపీసీ సెక్షన్‌ 497 చట్టబద్ధతపై విచారణచేపట్టడం తెల్సిందే. భర్త అనుమతి ఉన్న పక్షంలో వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటున్న ఈ చట్టంతో సమాజానికి ఏం ప్రయోజనమని కోర్టు బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది.

వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకునే వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్నామని ఆనంద్‌ బదులిచ్చారు. వ్యభిచారాన్ని నేరం కాదని చెబుతున్న విదేశీ చట్టాలను పరిగణనలోకి తీసుకోవద్దని, దేశంలోని సామాజిక స్థితిగతుల ఆధారంగానే ఈ చట్టం చెల్లుబాటును నిర్ధారించాలన్నారు. ‘భర్త అనుమతి ఉంటే అది వ్యభిచారం కాదని చట్టం చెబుతోంది. అలాంటప్పుడు సెక్షన్‌ 497తో సమాజానికి కలిగే ప్రయోజనం ఏంటి? చట్టంలో కొన్ని వైరుధ్యాలున్నాయి. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించే బాధ్యత మహిళలదేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top