ఐపీసీ 377ను విచారించనున్న సుప్రీం ధర్మాసనం

SC Hearing Petitions Against Criminalising Homosexuality - Sakshi

రిప్యూ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : మరో చారిత్రక తీర్పుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా వివాదంగా మారిన భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) 377పై దాఖలైన రిప్యూ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఐపీసీ 377 దేశంలో స్వలింగ సంపర్కం నేరం అనే భావాన్ని వ్యక్తం చేస్తోంది. దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హోమో సెక్సువల్‌ను చట్టబద్దం చేయాలని కొందరు, సెక్షన్‌ 377ను ఐపీసీ నుంచి తొలగించాలని కొందరు పలు కేసులను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, వైవీ చంద్రచూడ్‌, ఎఎమ్‌ కన్వీల్కర్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారించనుంది.

ఢిల్లీ హైకోర్టు తీర్పు     
స్వలింగ సంపర్క నేరంగా భావించే సెక్షన్‌ 377పై 2009లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధంగా ఉందని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో హోమో సెక్సువల్స్‌ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు తమకు కూడా వర్తిస్తాయని, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన  తీర్పును లెస్బియన్, గే, బైసెక్సువల్,లింగమార్పిడి (ఎల్‌జీబీటీ) చెందిన వ్యక్తులు 2013లో సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

సెక్షన్‌ 377 ఇద్దరు వ్యక్తుల లైంగిక ధోరణిని నాశనం చేస్తోందని, చట్టంపై సహేతుకమైన పరిమితులు విధించకూడదని ఎల్‌జీబీటీలు పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించడంతో.. మరోసారి సెక్షన్‌ 377 తెరమీదకు వచ్చింది. 149 సంవత్సరాల చరిత్ర గల ఈ సెక్షన్‌ అసహజ లైంగిక చర్యలకు పాల్పడే స్త్రీ, పురుషులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా విధిస్తారు.

స్వలింగ సంపర్కం రుగ్మత కాదు
స్వలింగ సంపర్కం రుగ్మత కాదని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ గతంలో ప్రకటించింది. హోమో సెక్సువల్‌ను మానవ లైంగిక వైవిద్యంగా పేర్కొంటూ.. దానిని ద్విలింగ సంపర్కమని తెలిపింది. సైకియాట్రిక్‌ సోసైటీ ప్రకటన ఎల్‌జీబీటీకి కొంత ఊరటనిచ్చింది. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టబద్దంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పును వెలువరిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top