
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న పరేఖ్ బాధ్యతలు చేపడతారు. ఆయన పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుంది. ఇకపై యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఇన్ఫోసిస్ తెలిపింది. పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ సారథ్యంలో ఇన్ఫోసిస్ పురోగమించగలదని కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు.
కీలకమైన సీఈవో పదవికి ఇన్ఫోసిస్ బయటి వ్యక్తిని తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో సీఈవోగా వ్యవహరించిన విశాల్ సిక్కా.. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితమే రాజీనామా చేశారు. నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు పరేఖ్ ఎంపిక జరిగినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫీ బాధ్యతలు చేపడుతున్న పరేఖ్.. పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.