జరిగేదంతా మన మంచికే అనే మాట.. చాలామంది తమ నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో వినే ఉంటారు. కానీ జరిగిపోయింది కూడా మంచికే అంటున్నారు.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నందన్ నీలేకని' (Nandan Nilekani). ఇంతకీ ఎందుకిలా అంటున్నారు?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది.. ఇక్కడ చూసేద్దాం.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలేకని.. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు. కానీ అదే సమయంలో తనకు ఆరోగ్యం సరిగ్గాలేకపోవడంతో.. పరీక్ష రాయలేకపోయారు. అంతే కాకుండా.. SAT లేదా GMATకు అప్లై చేసుకోవడానికి తాను బద్దకించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ తరువాత ముంబైలో ఉన్న ఒక చిన్న టెక్ సంస్థ పట్ని కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ గురించి తెలుసుకుని నందన్ నీలేకని అక్కడ చేరారు. ఆ సమయంలోనే ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy)ని కలిశారు. అప్పుడే తన జీవితం ఒక మలుపు తిరిగింది. సొంతంగా కంపెనీ స్థాపించాలని నారాయణమూర్తి ఆలోచన నచ్చింది. దీంతో నా అడుగులు.. ఆయన వెంట సాగాయని నీలేకని వెల్లడించారు. మా ప్రయాణంలో.. మాలాంటి ఆలోచన కలిగిన మరో ముగ్గురుని కలిశాము. ఆ తరువాత ఇన్ఫోసిస్ స్థాపించామని వివరించారు.
ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు.. చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. కానీ పట్టుదలతో శ్రమించడం వల్లనే.. ఆ కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచింది. 2022 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.
నిజానికి ఆ రోజు పరీక్ష రాయకపోవడమే మంచిదైందని నీలేకని చెబుతారు. ఒకవేళ పరీక్ష రాసుంటే.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ పరీక్ష రాయకపోవడం వల్ల.. నారాయణమూర్తిని కలిసి కంపెనీ స్థాపించారు. ఇదంతా చూస్తుంటే.. ఆ రోజు జరిగిన పని నందన్ నీలేకని జీవితాన్నే మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి


