సజ్జన్‌ కుమార్‌ దోషే

Sajjan Kumar gets life term in 1984 riots case - Sakshi

1984 సిక్కు అల్లర్ల కేసులో    జీవిత ఖైదు

రాజకీయ అండతోనే నేరం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

స్వాగతించిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్‌

న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సజ్జన్‌ కుమార్‌(73)ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన ఇక మిగిలిన తన జీవిత కాలమంతా జైలులోనే గడపాలని ఆదేశిస్తూ జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత జరిగిన 34 ఏళ్ల తరువాత సోమవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు రాజకీయ పలుకుబడి, మద్దతు ఉన్న వారే మతం పేరిట హింసకు పాల్పడ్డారని పేర్కొంది.

సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించిన కోర్టు..సజ్జన్‌ కుమార్‌పై హత్య, వేర్వేరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి నేరపూరిత కుట్ర పన్నడం, గురుద్వారాను అపవిత్రం, విధ్వంసం చేయడం తదితర అభియోగాలను మోపింది. ఈ కేసులో సజ్జన్‌తో పాటు ఇది వరకే దోషులుగా తేలిన మరో ఐదుగురు ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, ఈ నెల 31 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సజ్జన్‌ తరఫు లాయర్‌ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చారిత్రకమని బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్‌ స్వాగతించాయి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్‌ పేర్కొంది.

ముగ్గురు సాక్షుల పోరాట ఫలితం: ఈ కేసులో నిందితులైన సజ్జన్‌ కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై 2010లో విచారణ ప్రారంభమైంది. మూడేళ్ల తరువాత సజ్జన్‌ కుమార్‌ మినహా మిగిలిన వారంతా దోషులని కింది కోర్టు తేల్చింది. ఈ తీర్పును సీబీఐ సవాలు చేయగా తాజాగా జస్టిస్‌ ఎస్‌.మురళీధర్, జస్టిస్‌ వినోద్‌ గోయల్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సజ్జన్‌ కూడా దోషి అని ప్రకటించింది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు జగదీశ్‌ కౌర్, ఆమె కజిన్‌ జగ్షీర్‌ సింగ్, నిర్‌ప్రీత్‌ కౌర్‌ల అలుపెరుగని పోరాటం వల్లే సజ్జన్‌కు  శిక్ష పడిందని బెంచ్‌ పేర్కొంది.

నిందితులకు శిక్ష పడేందుకు మూడు దశాబ్దాలు పట్టినా కూడా సత్యం గెలిచి, న్యాయం జరుగుతుందని బాధితులకు భరోసా ఇవ్వడం ముఖ్యమని     వ్యాఖ్యానించింది. సీబీఐ రంగప్రవేశం చేశాకే సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి నోరు విప్పారని పేర్కొంది. మరోవైపు, సజ్జన్‌ కుమార్‌ ఢిల్లీలోనే ఉన్నారని, డిసెంబర్‌ 31లోగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరఫు లాయర్‌ వెల్లడించారు. ఒకవేళ ఆలోగా అత్యున్నత న్యాయ స్థానంలో తాజా తీర్పును సవాలుచేయకుంటే సజ్జన్‌కుమార్‌       లొంగిపోతారని తెలిపారు.

కళంకితుడిని సీఎం ఎలా చేస్తారు?: జైట్లీ
సజ్జన్‌ కుమార్‌కు జీవిత ఖైదు విధించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్వాగతించారు. ఇదే కేసులో సిక్కులు దోషిగా భావిస్తున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తప్పుపట్టారు. సిక్కుల ఊచకోతలో సజ్జన్‌కుమార్‌ ఒక మాయని మచ్చలా మిగిలిపోయారని, దేశం ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సిక్కుల దృష్టిలో దోషిగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఈ తీర్పు రావడం గమనార్హమని పరోక్షంగా కమల్‌నాథ్‌ను ఉద్దేశించి అన్నారు.

1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం సరికాదని, చట్టం తన పనిని తాను చేసుకుపోవాలని కాంగ్రెస్‌ పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో చెలరేగిన హింసలో కమల్‌నాథ్‌ పాత్ర కూడా ఉందని, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ కాంగ్రెస్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే కమల్‌నాథ్‌ తనపై    వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ కేసులో   తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మధ్యప్రదేశ్‌ సీఎంగా ప్రమాణం చేశాక పేర్కొన్నారు.

4 రోజుల్లో 2,733 మంది సిక్కుల ఊచకోత
1984, అక్టోబర్‌ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్‌ 1–4 మధ్య రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని పాలమ్‌ కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య కేసులో సజ్జన్‌ నిందితుడిగా ఉండగా, కోర్టు తాజాగా తీర్పును ప్రకటించింది. జగదీశ్‌ కౌర్‌ భర్త, కొడుకు, ఆమె ముగ్గురు కజిన్లు కేఖర్‌ సింగ్, గురుప్రీత్‌ సింగ్, రఘువేందర్‌ సింగ్‌లతో పాటు నరేందర్‌ పాల్‌ సింగ్, కుల్దీప్‌ సింగ్‌..మొత్తం ఐదుగురిని అల్లరి మూకలు దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని సజీవంగా దహనం చేయడాన్ని నిర్‌ప్రీత్‌ కౌర్‌ ప్రత్యక్షంగా చూసింది. 34 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమే అయినా నిందితుల అసలు రంగు బయటపెట్టేందుకు కృత నిశ్చయంతో పోరాడామని జగదీశ్‌ కౌర్, నిర్‌ప్రీత్‌ కౌర్‌ చెప్పారు. తాజా తీర్పు తమకు కొంత సాంత్వన చేకూర్చిందని, ఇన్నాళ్లూ తాము అనుభవించిన అన్యాయం, క్షోభ మరొకరికి రావొద్దని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top