రాజన్‌కు బెదిరింపులు | Sakshi
Sakshi News home page

రాజన్‌కు బెదిరింపులు

Published Fri, Apr 17 2015 1:48 AM

రాజన్‌కు బెదిరింపులు

చంపుతామంటూ ఐఎస్‌ఐఎస్ పేరుతో ఆర్బీఐకి ఈమెయిల్
 
ముంబై: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను చంపుతామంటూ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ పేరుతో వచ్చిన ఈమెయిల్ కలకలం రేపింది. దీంతో ముంబై పోలీసులు రాజన్‌కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గత నెలలో ఆర్బీఐ అధికార ఈమెయిల్ ఐడీకి బెదిరింపు ఈ మెయిల్ వచ్చిందని, దీనిని ఎవరు పంపారో విచారణ జరుపుతున్నామని మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కేపీ బక్షి గురువారం చెప్పారు.

రాజన్‌ను చంపడానికి ఒప్పందం కుదిరిందని, ఒకవేళ కాంట్రాక్టు మొత్తం కంటే ఎక్కువ డబ్బిస్తే దీనిపై పునరాలోచిస్తామంటూ ఐఎస్‌ఐఎస్583847ఃజీమెయిల్.కామ్ పేరు తో వచ్చిన మెయిల్లో ఉందని పోలీసులు తెలిపారు. ఈ జీమెయిల్ ఐడీని కొద్దిరోజుల్ల్లోనే ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జర్మనీ, అమెరికా, నైజీరియా  తదితర దేశాల్లో యాక్సెస్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఇలాంటి బెదిరింపు వ్యవహారాలను నైజీరియా రాకెట్ చేస్తుంటుందని, ఇది కూడా వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ మెయిల్ ఐడీ గురించి గూగుల్‌ను సంప్రదించామని, వారం రోజుల్లో వారి నుంచి వివరాలు వచ్చే అవకాశముందని చెప్పారు. దీనిపై ఆర్బీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం రాజన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలసి విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత ఇతర విషయాలను చెబుతామని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement