వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి | Rainwater must be store sayes Union Minister Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి

Apr 26 2016 12:56 AM | Updated on Aug 30 2019 8:24 PM

వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి - Sakshi

వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి

భవిష్యత్తులో నీటి అవసరాలకోసం వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
♦ చెరువులు, కుంటల కబ్జాతో వర్షపు నీరు
♦ వృథా అవుతోందన్న కేంద్ర మంత్రి
♦ ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు నిర్మించాలి
♦ హడ్కో నుంచి రాష్ట్రానికి మూడు అవార్డులు
♦ మెరుగైన మంచినీటి సరఫరాకు అవార్డు స్వీకరించిన కేటీఆర్
 
 సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో నీటి అవసరాలకోసం వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఇక్కడి ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్‌లో హడ్కో 46వ వ్యవస్థాపకదిన వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హడ్కో రుణ సాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో మంచినీటి సమస్యలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములను తప్పనిసరిగా నిర్మించాలని, ఈ విషయంలో చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు.

పెరుగుతున్న పట్టణీకరణ వల్ల చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, వాటిల్లో ఆక్రమణలను తొలగించకపోవడంతో వర్షం నీరు వృథాగా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి కోసం ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే వృథాగా పోతున్న ఆ నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని, నీటిని పొదుపుగా వాడేలా ప్రోత్సహించాలని, ఖాళీస్థలాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని పిలుపునిచ్చారు.

 అవార్డు స్వీకరించిన కేటీఆర్
 ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు సంస్థ ద్వారా మెరుగైన రీతిలో మంచినీటిని సరఫరా చేయడమే కాకుండా, క్రమబద్ధీకరించిన పద్ధతిలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తూ, నీటి ఎద్దడి రాకుండా తీసుకున్న చర్యలకు గుర్తింపుగా హడ్కో ఇచ్చిన అవార్డును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా ఫేజ్-3, గోదావరి ఫేజ్-1 ద్వారా హైదరాబాద్ అవసరాలకు సరిపోయేలా మంచి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అన్ని ఇళ్లలోనూ ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా ఇంకు డు గుంతలు నిర్మించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా గుర్తించిన శివారు మున్సిపాలిటీల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా  సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. హడ్కో ద్వారా తీసుకున్న రూ. 3,500 కోట్ల రుణాన్ని ఈ పథకం కోసం పారదర్శకంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో హైదరాబాద్ పరిధిలో రోజుకు 150 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేసేవారమని, ప్రస్తుతం 350 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.
 
 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అవార్డు
 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు  హడ్కో అందించిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున  గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అందుకున్నారు. అలాగే బలహీన వర్గాల వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలుగా వేగంగా రుణ పంపిణీ చేసినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ బి.ఆర్.జి. ఉపాధ్యాయ మరో అవార్డు అందుకున్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ డెరైక్టర్ దాన కిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement