
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నవంబర్ నెల్లో బాధ్యతలు చేపట్టే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ పట్టాభిషేకానికి ఇంకా కచ్చితమైన ముహూరం నిర్ణయించికపోయినా.. నవంబర్ నెల్లోనే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలోనే అధ్యక్ష బాధ్యతల బదలాయింపుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 31 లోపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని రెండు రోజుల కిందట పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ నవంబర్ నెల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి కంటే ముందే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం మొదట్లో జరిగినా.. అది కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికాకపోవడం వల్లే రాహుల్ ఎన్నికకు కారణం అయిందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.