ఈసారి కళ తప్పుతున్న ‘పుదుచ్ఛేరి’

As Puducherry Hotels Drop Music Shows To Protest Taxes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి పుదుచ్చేరిలో జరిగే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న పర్యాటకులకు ఆశాభంగం తప్పదు. పుదుచ్ఛేరి హోటళ్లు ఈసారి ఆడంబరంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం లేదు. ముఖ్యంగా సంగీత విభావరి లాంటి కార్యక్రమాలకు స్వస్తి చెబుతున్నాయి. అందుకు కారణం వాటిపైన 25 శాతం వినోద పన్నును వేయడమే కాకుండా 28 శాతం జీఎస్టీని వసూలు చేయడం. అంతేకాకుండా మ్యూజిక్‌ లైసెన్సింగ్‌ కంపెనీలు సంగీత విభావరి నిర్వహించే ప్రతి హోటల్‌ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ షరతు పెట్టడం కూడా కారణమే.

ఈ చట్టాలు కొత్తగా వచ్చినవేవి కావు. కానీ ఈ సారి చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడమే హోటళ్ల యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. గతంలో ప్రేక్షకుల ఎంట్రీ టిక్కెట్‌ను ఆహారానికి ఇంత, మద్యానికి ఇంత, వినోదానికి ఇంత అని విభజించి, వినోదానికయ్యే మొత్తంపైనే పన్ను కట్టేవాళ్లట. ఇక ఆ పప్పులు ఉడకవని, ప్రేక్షకుడి ఎంట్రీ టిక్కెట్‌ మొత్తంపైన వినోద పన్ను, జీఎస్టీలు కట్టాలని కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ నిర్ణయించడమే కారణమట. ఈ విషయాన్ని షేన్‌బాగ హోటల్‌ మేనేజర్‌ విమల్‌ తెలిపారు. ఈ పన్నులు కడితే తమకు మిగిలేది ఏమీ ఉండదని సన్‌వే మనోర్‌ హోటల్స్‌ ఉపాధ్యక్షుడు డీ. లారెన్స్‌ చెప్పారు. సాధారణ సమయాల్లోకెల్లా న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డీజేలు తమ ఫీజును పదింతలు పెంచుతారని ఆయన అన్నారు. తాము నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా కూడా ఈ సారి ఎలాంటి సంగీత కార్యక్రమాలను నిర్వహించదల్చుకోలేదని ఆయన తెలిపారు.

క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా దేశంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుదుచ్చేరి ఒకటి. గతేడాది 16.63 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, వారిలో 15.31 లక్షల మంది భారతీయులే ఉన్నారని టూరిజం విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top